రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కోటి 30 లక్షల పేద కుటుంబాలకు వెయ్యి రూపాయలు ఇచ్చామని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. దీన్ని మెచ్చుకోవాల్సింది పోయి... ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని ధ్వజమెత్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ డబ్బులని ప్రచారం చేయడం ఏంటని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు... నర్సీపట్నంలో డాక్టర్తో మంచి నాటకం ఆడించారని అంబటి పేర్కొన్నారు. డాక్టర్ అయ్యన్నపాత్రుడి ఇంటికి ఎందుకు వెళ్లాడని నిలదీశారు. ఈ విపత్కర పరిస్థితిల్లో హైదరాబాద్లో కూర్చొని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో తెదేపా ఉన్నా... కేసీఆర్కు చంద్రబాబు ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్కు లేఖ రాస్తే క్వారంటైన్లో పెడతారని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ఉదారంగా నిధులు ఇవ్వమని ప్రధానిని ఎందుకు కోరడంలేదని ప్రశ్నించారు.
ఇదీ చదవండీ... 'ఆర్టీజీఎస్‌ను వాడుకోండి... అన్న క్యాంటీన్లు తెరవండి'