రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరు మండలం దొండపాడులో రైతులు, మహిళలు.. శ్రీలక్ష్మీ గణపతి, సుదర్శన యాగం నిర్వహించారు. అమరావతి ఉద్యమానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా.. తమ ఆకాంక్ష నెరవేరాలని ఈ హోమం చేస్తున్నట్లు రైతులు చెప్పారు. దిల్లీ రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని రైతులు స్పష్టం చేశారు. యాగం పూర్ణాహుతి సమయంలో రైతులు, మహిళలు జై అమరావతి అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.
రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా అచ్చంపేట నుంచి మందడం వరకు కాలినడకన వచ్చిన సాయి అనే యువకుడు శిబిరంలో 36 గంటల నిరాహార దీక్షకు దిగాడు. మూడు రాజధానులు వద్దు....అమరావతే ముద్దంటూ యాగంలో పాల్గొన్న వారు నినదించారు. ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్ని డిమాండ్ చేశారు. మిగిలిన రాజధాని గ్రామాల్లోనూ 407వ రోజు దీక్షా శిబిరాల వద్ద రైతులు నిరసనలు కొనసాగించారు.
ఇదీ చదవండి: గుంటూరు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన దినేశ్ కుమార్