Amaravati Farmers Land Rent Funds Delayed: అందరి సంతోషం కోసం బటన్ నొక్కి డబ్బులు నేరుగా మీ ఖాతాల్లో వేస్తున్నా అంటూ.. సీఎం జగన్ ప్రతిసభలో ఊదరగొడుతున్నారు. అందరికీ బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నానని చెప్పే ముఖ్యమంత్రి.. రాజధాని రైతుల విషయంలో మాత్రం కక్షగట్టారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది కౌలు గడువు ముగిసి నాలుగు నెలలైనా.. ఇంకా జమచేయకుండా వేధిస్తున్నారు. దీంతో వైద్యానికీ డబ్బులు లేక రైతులు అవస్థలు పడుతున్నారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏటా మే నెలలో కౌలు చెల్లించేవారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌలు సకాలంలో అందక రైతుల తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. రాజధాని గ్రామాల్లో ఇప్పుడు వ్యవసాయం లేదు. ఇతర వేరే వ్యాపారాలు నడవటం లేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కౌలే అన్నదాతలకు అక్కరకొస్తోంది.
కానీ, కౌలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందిపెడుతున్నందున.. ఏటా రైతుల కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. ఈసారి కోర్టుకు వెళ్లినా ప్రభుత్వం స్పందించలేదు. అన్నంపెట్టే భూములను ప్రభుత్వానికి ఇచ్చి.. కౌలు కోసం నెలల తరబడి చూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 240 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మే 5న జీవో జారీ చేసింది. 22,948 మంది రైతులకు చెల్లించాల్సిన 183.17 కోట్ల రూపాయల కౌలు బిల్లులను సీఎఫ్ఎమ్ఎస్ లోకి అప్‌లోడ్ చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. రైతులు కోర్టును ఆశ్రయించటంతో కొందరికి మాత్రం విడుదల చేశారు. ఇప్పటి వరకూ 16.63 కోట్ల రూపాయల కౌలు సొమ్ము ఖాతాల్లో జమ అయింది. మిగిలిన వారికి ఇంకా రాలేదు. వారంతా ఎప్పుడు కౌలు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
"నయా పైసా తీసుకోకుండా ప్రభుత్వానికి భూములు ఇచ్చాము. మాకు ప్రతి సంవత్సరం మే నెలలో పది సంవత్సరాల వరకు కౌలు ఇస్తామని చట్టంలో పొందుపరిచారు. చంద్రబాబు పాలనలో మాకు కౌలు క్రమం తప్పకుండా జమాయ్యింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గరి నుంచి మేము కోర్టుకు వెళ్లందే కౌలు జమా కావటంలేదు." -సీతారామయ్య, రాజధాని రైతు
"ఏప్రిల్, మే నెలలో రావాల్సిన కౌలు ఇంతవరకు రాలేదు. మేము ఏం తిని బతకాలి. నాకు జబ్బు చేసింది మందులకు డబ్బులు లేవు. ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు అప్పులు చేశాను." -డి.సాంబశివరావు, రాజధాని రైతు
కౌలు డబ్బులు జమా కాకపోవటంతో పేద రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుటుంబం గడవక, ప్రాణాలు తీసే రోగాలకు చికిత్స చేయించుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. రైతులు ఆవేదన చెందుతున్నారు.
తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన రైతు సాంబశివరావుకు గుండె జబ్బు ఉంది. నెలనెలా గుంటూరుకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం కిందపడి నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన భార్య కూడా గుండెజబ్బుతో మరణించారు. వైద్యం కోసం డబ్బు లేక కుటుంబ ఖర్చులకు అప్పు చేసి కాలం గడుపుతున్నారు.
"కరోనా సమయంలో నేను కిందపడ్డాను. అప్పుడు కాలు విరిగింది. నెలకు పదిహేను వేల రూపాయలు ఖర్చవుతోంది. మే నెలలో రావాల్సిన కౌలు నగదు ఇంకా రాలేదు." - సాంబశివరావు, వెలగపూడి
వెలగపూడికి చెందిన మరో రైతు సీతారామయ్య తన ఎకరా పొలాన్ని రాజధాని కోసం ఇచ్చారు. క్యాన్సర్ చికిత్స చేయించుకుంటున్న ఆయన కౌలు సొమ్ము జమ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆయన భార్య సుదర్శనమ్మ కన్నీటి పర్యంతయ్యారు.
"మాకు ఆర్థికంగా ఏ ఆధారం లేదు. పింఛన్ కూడా రావటం లేదు. ప్రతిసారి ఇతరులను అడిగితే వారు మాత్రం ఎంతవరకు సహకరిస్తారు. మాకు ఇతర ఏ పథకాలు అందటం లేదు." - సుదర్శనమ్మ, వెలగపూడి
తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన రైతు వెంకటేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్నారు. ఆయన కుటుంబానికి ఉన్న 96 సెంట్ల భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. కౌలు వస్తే ఆ నగదుతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. నెలకు 15 వేల వరకు ఖర్చవుతోందని, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బయట అప్పులు చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"మే నెలలో పడాల్సిన కౌలు నగదు ఇంతవరకు పడలేదు. మా ఆరోగ్యం సరిగా లేదు. నాకూ ఒంట్లో బాలేదు. కౌలు నగదు కోసం ఎదురుచూస్తున్నాం. నెలకు 30 వేల రూపాయల ఖర్చవుతోంది. మొత్తం 4లక్షల రూపాయల అప్పు అయ్యింది." -వెంకటేశ్వరరావు, వెలగపూడి గ్రామం
రాజధానిలో 2014-19 మధ్య కాలంలో అసైన్డ్ భూముల అమ్మకాలపై సీఐడీ కేసు విచారణ నడుస్తోంది. పూలింగ్ కింద వచ్చిన భూముల్లో అసైన్డ్ భూములూ ఉండటంతో వారికీ కౌలు రావటం లేదు. మొత్తం 3వేల ఎకరాల్లో 12వందల ఎకరాలకు సంబంధించి వివాదాలు లేవని సీఆర్డీఏ కమిషనర్ తేల్చారు. కనీసం ఆ రైతులకైనా కౌలు చెల్లించాలని కోరుతున్నారు. అసైన్డ్ రైతులంతా దళితులే కావటంతో కౌలు అందక ఆర్థికంగా చితికిపోతున్నారు.