Amaravati-Vijayawada Main Roads: అమరావతి- విజయవాడ మధ్య ప్రధాన రహదారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రధానంగా అమరావతి నుంచి తుళ్లూరు మధ్య 18 కిలోమీటర్ల మేరకు రహదారి దారుణంగా దెబ్బతింది. కొన్ని చోట్ల రహదారి నిలువునా చీలిపోయింది. రహదారిపై తారు లేచిపోయి.. కంకర రాళ్లు పైకి తేలి ప్రమాదకరంగా మారింది. అమరావతి నుంచి పెదమద్దూరు వరకు రహదారి పలుచోట్ల కుంగిపోయింది. గుంతల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు. పలువురు వాహనదార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. కనీసం ఈ రహదారిపై పాదచారులు సైతం నడవలేని దయనీయ పరిస్థితి నెలకొంది.
"రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. అమరావతి, పెద్దమద్దూరు, వడ్లమాను రోడ్లన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. ద్విచక్రవాహనదారులు, బస్సులు, ఆటోలు ఇలా ఏవైనా సరే ఈ రోడ్లపై ప్రయాణించలేక అదుపుతప్పి కింద పడిపోతున్నారు. మధ్యాహ్నం తప్పితే రాత్రి పూట ఈ రోడ్లపై పోలేని పరిస్థితి నెలకొంది"-స్థానికులు
అమరావతి-విజయవాడ రోడ్డులో పెదమద్దూరు వద్ద వంతెన శిథిలావస్థకు చేరింది. రక్షణ గోడలు దెబ్బతినడంతో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. వంతెన నుంచి వెళ్లే అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పగలు ఓ మాదిరిగా నెట్టుకురావచ్చని.. అదే రాత్రి పూటైతే వాహనాలు కిందపడక తప్పదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక వర్షం పడితే రహదారిపై ప్రయాణించడం కష్టమని చెబుతున్నారు.
"పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చిన్నపాటి వర్షాలు పడిన ఈ రోడ్లపై పోలేము. పెద్ద వర్షాలు వచ్చి గుంతలు కనపడక పెద్ద పెద్ద వాహనాలు వాటిలో దిగబడుతున్నాయి. ఈ రోడ్ల కారణంగా చాలా వరకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్లన్ని గుంతలే. ఈ రోడ్డుపైనే ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ తిరుగుతున్నారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు"-వాహనదారులు
గత అక్టోబరులో రహదారిని విస్తరించడానికి శంకుస్థాపన చేయగా.. ఈ పనులు ప్రాథమిక దశను దాటలేదు. దారుణ పరిస్థితిలో ఉన్న రహదారిపై నడిచే వాహనాలు దెబ్బతింటున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. టైర్లు, షాక్ అబ్జార్స్, మిగతా వాహన భాగాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలక రహదారిపై ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ అధికారులు స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి:
- డయాబెటిస్ మందులతో కంటిచూపు దెబ్బతింటుందా?.. డాక్టర్లు ఏమంటున్నారు?
- Gangamma Jathara: తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం.. 900 ఏళ్లనాటి ఆనవాయితీలో ప్రత్యేకతలివే..
- రోహిత్ చెత్త రికార్డు.. ఇక సూర్యను ఆపడం కష్టమే.. ఆర్సీబీకి అచ్చిరాని మూడో స్థానం!
- అన్నం వండలేదని ఇటుకతో కొట్టి భార్య హత్య.. 'ఆమె'పై కోపంతో ఉరేసుకున్న భర్త!