Adulterated chilli powder: జనం అలికిడి లేని మట్టిదారులు.. చుట్టూ కొండలు.. ఇలాంటి చోట జనరేటర్లు, మర యంత్రాలు, గ్రేడింగ్ మెషీన్లు ఉన్నాయని ఎవరికైనా సందేహం వస్తుంది. మిర్చి తుక్కు, వృథా నుంచి విత్తనాలు వేరు చేసే కేంద్రాల పేరుతో కల్తీ కారాన్ని తయారీ చేస్తున్నారు. అలా తయారైన కారాన్ని ఎర్రగా మార్చేందుకు హానికర రసాయనాలను కలుపుతున్నారు. ఈ దందాకు జనసంచారం లేని గుంటూరు నగర శివారులోని పేరేచర్ల కొండప్రాంతాలు, పొలాలను కేంద్రంగా చేసుకున్నారు.
నగర శివారులో ప్రాంతంలో: మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి ముడిసరుకు సేకరిస్తారు. అక్కడ తొడిమలు, మిర్చితుక్కు, విత్తనాలతో కలసి వృథా వస్తుంది. అలాగే మిర్చియార్డు, శీతల గోదాముల్లో బస్తాలు అటుఇటూ మార్చే క్రమంలో కాయలు కిందపడి తుక్కుగా మారతాయి. వాటిని కిలో 20 నుంచి 22 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు. వీటి నుంచి విత్తనాలను వేరుచేసి.. ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. దీని కోసం నగరశివారు నాయుడుపేట, అంకిరెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.
రసాయనాలు కలుపుతూ: అయితే మిర్చి ధర పెరగడం, కారానికి డిమాండ్ ఉండటంతో ఇప్పుడు ఆ యూనిట్లలో కల్తీ సరుకు తయారు చేస్తున్నారు. తుక్కు సరుకుని పొడిగా మార్చి రంగులు, రసాయనాలు కలిపి ఎర్రగా ఉండేలా కల్తీ కారం తయారుచేస్తున్నారు. విద్యుత్తు సౌకర్యం కూడా లేని ప్రాంతంలో జనరేటర్లు ఏర్పాటు చేసుకుని యంత్రాల సాయంతో నకిలీ దందాకు తెరలేపారు. వీలైనంత వరకు రాత్రి వేళ కారం తయారుచేస్తూ పగటి సమయంలో టార్పాలిన్లతో కప్పేస్తున్నారు.
మార్కెట్లో భారీగా ధర:ప్రస్తుతం మార్కెట్లో మిరపకాయలతో పాటు.. కారం ధర అధికంగా ఉంటోంది. నాణ్యమైన మిర్చి ధర క్వింటా 20 వేలు, తాలుకాయలు కూడా క్వింటా 10 వేల రూపాయల వరకూ ఉన్నాయి. ఇంత ధర పెట్టి కాయలు కొని కారం తయారీకి ఖర్చు ఎక్కువవుతుంది. పది కిలోల కారం రావాలంటే సుమారు 12 కిలోల మిర్చి మర పట్టించాలి. ఇలా కిలో కారం తయారీ, ప్యాకింగ్, రవాణా ఇతర ఖర్చులు కలిపితే కిలో 260 రూపాయలకుపైగా విక్రయించాలి. ప్రముఖ కంపెనీల కారంపొడి మార్కెట్‌లో కిలో 270ల నుంచి 350 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు.
కల్తీ కారం తక్కువ ధరకే విక్రయిస్తూ: అయితే తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్న కల్తీ కారాన్ని కిలో కారం 120ల నుంచి 150 రూపాయలకే విక్రయిస్తున్నారు. బయట మిర్చి ధర ఎక్కవగా ఉండటంతో చవగ్గా లభించే కల్తీ కారానికి డిమాండ్ పెరిగింది. దీంతో అక్రమార్కుల వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. తాము ఎంపికచేసుకున్న వారికే ఈ కల్తీ కారాన్ని విక్రయిస్తారు. ఇక్కడే బస్తాల్లో నింపి రోజువారీగా ఎక్కువగా ఉపయోగించే హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, క్యాటరింగ్ వారికి విక్రయిస్తున్నారు.
కల్తీ కారానికి డిమాండ్: తక్కువ ధరకే వస్తుండటం, స్థానికంగా లభిస్తుండటంతో వ్యాపారులు నాసిరకం కారం కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. కొందరు వ్యాపారులు తయారీదారుల నుంచి బస్తాల రూపంలో కారం కొని అరకిలో, కిలో, ఐదు కిలోలు ప్యాకింగ్ చేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. నగర శివారు ప్రాంతాలకు యంత్రాంగం వెళ్లకపోవడం, తుక్కు నుంచి కల్తీ కారం తయారు చేసేవారికి కలసివస్తోంది. ఈ దందా తయారీదారులకు కాసుల వర్షం కురుస్తుండగా వినియోగదారులకు మాత్రం ఆరోగ్యం గుల్లవుతోంది.
ఇవీ చదవండి: