గుంటూరు లాలాపేటలో ఏడాది క్రితం జరిగిన హత్య కేసు చిక్కుముడి వీడింది. ఘటనకు కారకుడైన రాజు.. పోలీసులకు లొంగిపోయాడు. సుజాత అనే మహిళను హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడిని రేపు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్య తెలిపారు.
కర్నూలు జిల్లాకు చెందిన రాజు, సుజాతకు వివాహేతర సంబంధం ఉందని... వారు గుంటూరు వచ్చి ఏటుకూరు రోడ్డులోని వర్కర్స్ కాలనీలో నివసించారని డీఎస్పీ తెలిపారు. రాజు చెడు వ్యసనాలకు అలవాటు పడి.. ఆలయంలో చోరీ చేస్తూ పోలీసులకు దొరికి పోయాడని, అతడిని జైలు నుంచి విడిపిస్తానని చెప్తూ.. రంగ అనే యువకుడు సుజాతకు దగ్గరయ్యాడని... చెప్పినట్లుగానే కొద్ది రోజుల తర్వాత రాజుని అతను బయటకు తీసుకొచ్చాడని డీఎస్పీ తెలిపారు.
రంగ, సుజాతల పరిచయంపై రాజుకి అనుమానం రాగా.. ఇరువురూ రహస్యంగా మాట్లాడుకోవడం గమనించి అతడి మీద రాజు దాడి చేశాడని డీఎస్పీ తెలిపారు. రంగ వ్యామోహంలో పడి సుజాత తనను పట్టించుకోవడం లేదని.. ఆమెనూ అడ్డు తొలగించుకోవడానికి పథకం రచించాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమెను హత్య చేసి.. మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీశాడు. బయటకు వెళ్తూ లైట్ ఆపే బదులు అనుకోకుండా ఫ్యాన్ స్విచ్ వేశాడు. ఫ్యాన్ రెక్కలు విరిగి సుజాత మృతదేహం కిందపడిపోగా.. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటి యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఇప్పటికి ఆ కేసు కొలిక్కి వచ్చింది.
ఇదీ చదవండి:
చదువుకుంటానంటే ఇంట్లోంచి వెళ్లగొట్టారు... విశ్రాంత ఎస్పీపై కోడలి ఫిర్యాదు