Permission for Mercy Killing: కారుణ్య మరణానికి అనుమతి ఇవాలంటూ బాపట్ల జిల్లా బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గొట్టిపాటి సుధారాణి సీఎంకు విన్నవించేందుకు వస్తుండగా తాడేపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బొడ్డువానిపాలెంలో తమ ఇంటి వద్ద దారి లేకుండా స్థానిక వైసీపీ నాయకుడు నేరెళ్ల వెంకటేశ్వరరావు గోడ కట్టారని.. గతేడాది కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లిలో ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం హుటాహుటిన అధికారులను పంపి సమస్యను పరిష్కరించారు.
తాజాగా వైసీపీ నేత వెంకటేశ్వరరావు మళ్లీ గోడ నిర్మించి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుధారాణి చెప్పారు. గుంటూరు శాసనసభ్యులు ముస్తఫా సహకారంతో వెంకటేశ్వరరావు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుధారాణి తెలిపారు. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు.
దీంతో సీఎం అనుమతితో కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సుధారాణి కుమార్తె హారిక చెప్పారు. అనేకమందిని కలిసి.. తమ సమస్య చెప్పినా ఎవరూ కూడా ఏం చేయలేమని అంటున్నారని వాపోయారు. సీఎం అనుమతి తీసుకునేందుకు తాడేపల్లికి పాదయాత్రగా వచ్చిన సుధారాణి కుటుంబ సభ్యులను సీఎం నివాసానికి సమీపంలో పోలీసులు అడ్డుకొని స్టేషన్కి తరలించారు.
"గత ఏడాది జూన్ నెల 18వ తేదీన.. మా ఇంటికి దారి లేదని న్యాయం చేయాలని సీఎం గారి దగ్గరకి పాదయాత్రగా వీల్ చెయిర్లో వచ్చాం సర్. నాకు అప్పుడు ఆరు ఆపరేషన్లు అవ్వడం వలన.. వీల్ చెయిర్లో వచ్చాను. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు వచ్చాను సర్. వచ్చినప్పుడు ఇక్కడ మమ్మల్ని అందరూ ఆపేశారు. మీకు న్యాయ చేస్తామని.. వెనక్కి రమ్మని.. అర్ధరాత్రి సమయంలో మా ఇంటి దగ్గర దించారు. జిల్లా అధికారులందరూ వచ్చి.. గోడని పగలకొట్టించారో అదే దారిలో ఇప్పుడు మళ్లీ గోడ కడుతున్నారు. మాకు న్యాయం చేయమని తిరగని చోటు లేదు సర్. అందరినీ కలిసాం. ఎవ్వరూ కూడా మేము ఏమీ చేయలేని స్థితి అని అంటున్నారు. మాకు దారి ఇవ్వకపోయినా పరవాలేదు. కనీసం మా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వమని చెప్పండి". -గొట్టిపాటి సుధారాణి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
"కోర్టు నుంచి వారానికి ఒక నోటీసు పంపిస్తూనే ఉన్నారు అతను. అరు నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. గత వారం ఒక నోటీసు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఇంకొక నోటీసు ఇచ్చారు. మేము ఏం తప్పు చేయలేదు. మేము ఎందుకు నోటీసు తీసుకోవాలి. అందరినీ కలుస్తూనే ఉన్నాం.. కానీ మాకు ఎవరూ న్యాయం చేయడం లేదు". - గొట్టిపాటి హారిక, వైద్యురాలు
ఇవీ చదవండి: