పల్స్ పోలియో చుక్కలు వేయమని అడిగితే.. ఆశా కార్యకర్త తమపై దాడి చేశారని బాధిత కుటుంబం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే..
గుంటూరు జిల్లా చేబ్రోలుకి చెందిన నాగభూషణం దివ్యాంగుడు. అతని సోదరుడికి కూడా పోలియో రావడంతో అంగవైకల్యం ఏర్పడింది. అయితే నాగభూషణానికి ఇటీవల మగబిడ్డ జన్మించాడు. పుట్టినబిడ్డకు తమ పరిస్థితి రాకూడదని క్రమం తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలనుకుని బిడ్డను తీసుకుని ఆశా కార్యకర్త వద్దకు వెళ్లాడు. ఆమె పోలియో చుక్కలు వేయకుండా తరుచూ.. రేపు రండి, తరువాత రండి అని ఇబ్బంది పెట్టారని బాధితుడు చెప్పాడు. బిడ్డకు ఏమైనా ఆవుతుందనే ఆందోళనతో గుంటూరు తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించినట్లు చెప్పారు.
ఆశా కార్యకర్తలు సరిగ్గా పని చేయడం లేదని... తమ బిడ్డకు పోలియో చుక్కలు వేయడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. దానిని మనసులో ఉంచుకుని... కక్షతో ఆమె మనుషులను పెట్టించి తమపై దాడి చేయించారని బాధితుడు వాపోయాడు. ఆశా కార్యకర్త, వారి కుటుంబసభ్యులు నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితుడు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఏఎస్పీ గంగాధరానికి ఫిర్యాదు చేశాడు.
ఇదీ చదవండి:పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు.. అంతలోనే..!