కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సిరాళ్ల దొడ్డి మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బొలోరో ట్రాలీ వాహనం ఢీకొని బడేసాబ్ (53) మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న గ్రామీణ ఎసై రామసుబ్బయ్య కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో మృతదేహం
గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమీప ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనస్థలానికి చేరుకున్న సిబ్బంది.. మృతదేహన్ని పరిశీలించి.. మూడు రోజుల క్రితమే చనిపోయినట్లు నిర్థరణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు.. దొంగతనానికి వచ్చి కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాతే మరిన్ని వివరాలు తెలియచేస్తామని సీఐ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని భారీ వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు కడియం మండలం వెంకాయమ్మపేటకు చెందిన ముంజేటి రామారావు (40), ముంజేటి లక్ష్మణరావులుగా గుర్తించారు. ఆలమూరు మండలం చింతలూరులో శ్రీ నూకాంబిక అమ్మవారి దర్శనానికి వచ్చి తిరిగి వారి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా రావులపాలెం వైపు వెళ్తున్న భారీ వాహనం.. జొన్నాడ జంక్షన్ హైవేపై వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనపై మండపేట రూరల్ సీఐ మంగాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యాదాఘాతంతో దింపు కార్మికుడు మృతి
విద్యుదాఘాతానికి గురై దింపు కార్మికుడు మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజులపాలెంలో జరిగింది. దింపు కార్మికుడు మాకే పెద్దిరాజు (50) దింపు తీస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. కొబ్బరి ఆకుల ద్వారా విద్యుత్ సరఫరా జరిగి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు.
రైలు కిందపడి యువకుడు మృతి
రైలు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. మృతుడు అదే గ్రామానికి చెందిన భీమినేని ఫ్రాన్సిస్ (27)గా గుర్తించారు. ఓ హోటల్లో పనిచేసే ఈ యువకుడు.. రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు.. ఫిరంగిపురం రైలు పట్టాలపై మృతదేహం ముక్కలు ముక్కలుగా పడి ఉండటాన్ని చూసి భయందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న నరసరావుపేట రైల్వే పోలీసులు వివరాలు సేకరించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
50 గొర్రెలు మృతి
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలితాండా సమీపంలో 50 గొర్రెలు మృతి చెందాయి. ఆముదం ఆకులు తినటంతో.. చనిపోయినట్లు బాధితులు వాపోయారు. సుమారు రూ. 5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుగురికి చెందిన 50 గొర్రెలు మృతి చెందటంతో పండగరోజు తమ కుటుంబాల్లో విషాదం నెలకొందని విచారం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
అరటి చెట్లకి నిప్పు
అనంతపురం జిల్లా నార్పల మండల గంగనపల్లి గ్రామంలో అరటితోటకు దుండగులు నిప్పుంటించారు. రామాంజనేయులు, ధనుంజయ రైతులకు చెందిన అరటి తోట పూర్తిగా దగ్దం అయ్యింది. దాదాపు 10 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి:
పంచలింగాల చెక్‌పోస్టు వద్ద రూ.1.04 కోట్ల బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం