గుంటూరు జిల్లాలో 2008-డీఎస్సీలో ఎంపికై.. తుది జాబితా నుంచి తొలగించబడిన 171 మంది అభ్యర్థులకు ఇవాళ నియామక కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరిని ఒప్పంద విధానంలో మినిమం టైం స్కేల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా నియమించారు. నియామక కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్న సమాచారంతో ఉదయాన్నే కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉదయం ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ సాంకేతిక కారణాలతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మెరిట్ ప్రాతిపాదికన కౌన్సిలింగ్ నిర్వహించాలా? లేక రోస్టర్ విధానాన్ని అనుసరించాలా? అనే విషయంపై సందిగ్ధత ఏర్పడగా.. కొందరు అభ్యర్థులు రోస్టర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. చివరకు అన్ని జిల్లాల మాదిరిగానే మెరిట్ ప్రాతిపదికన నియామక కౌన్సెలింగ్ నిర్వహించారు. అధికారుల ప్రణాళిక లోపంతో సాయంత్రం వరకు ప్రక్రియ కొనసాగింది.
కనీస టైం స్కేల్‌తో...
డీఎస్సీ-2008కి సంబంధించి 2,193 మంది అభ్యర్థులకు కనీస టైమ్ స్కేలుతో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కేవలం ఈ డీఎస్సీకి మాత్రమే వర్తించేలా ప్రత్యేకంగా మినిమమ్ టైం స్కేల్ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. డీఎస్సీ-2008లో అర్హతల మార్పు కారణంగా 4,657 మంది అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వీరందరి జాబితాను పరిశీలించి, అర్హులను ఎంపిక చేశామన్నారు. వీరికి వృత్తి శిక్షణ ఇచ్చి, ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో నియమిస్తామని మంత్రి చెప్పారు.
ఉద్యోగాలు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు...
డీఎస్సీ 2008 అభ్యర్ధులకు కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు కల్పిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 4657 మంది అభ్యర్థులకు గానూ.. 2193 మందిని ఎస్జీటీలుగా నియమిస్తూ విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా.. వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరందరికీ మినిమమ్ టైమ్ స్కేలు వర్తిస్తుందని.. ప్రభుత్వం పేర్కొంది. ఎస్జీటీలుగా నియమితులైన వారందరికి.. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలే వర్తిస్తాయని తెలిపింది. ప్రభుత్వం సూచించిన విధంగా.. ఆరు నెలల్లోగా ప్రాథమిక విద్యకు సంబంధించిన బ్రిడ్జి కోర్సు చేయాల్సిందిగా స్పష్టం చేసింది.
ఇవీచదవండి.