Tension at Thullur: గుంటూరు జిల్లా తుళ్లూరులో శనివారం పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆర్5 జోన్‌ను నిరసిస్తూ, అమరావతి రైతులకు మద్దతుగా ప్రముఖ న్యాయవాది, జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తుళ్లూరు నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు రాజధానిలోని 29 గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. మరోవైపు అదే సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించినందుకు ప్రభుత్వానికి మద్దతుగా తుళ్లూరు వైసీపీ నేతలు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టనున్నారు.
రెండూ ఒకే సమయంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు ఇద్దరికీ అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు. మరోవైపు శుక్రవారం రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులను ఐక్య కార్యాచరణ సమితి నేతలు అడ్డుకున్నారు. దీనిని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఐకాస నేత పువ్వాడ సుధాకర్‌ను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పిలిపించారు. పనుల అడ్డుకుంటే కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులను అడ్డుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని ఎస్పీకి సుధాకర్ తెలియజేశారు.
వైసీపీ నేతలు, జడ శ్రవణ్ గృహనిర్బంధం: రాజధాని ప్రాంతంలో శనివారం ర్యాలీలకు పిలుపునిచ్చిన వైసీపీ నాయకులను, జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్‌లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతిలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దాదాపు 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ అనుమతి లేకుండా రోడ్లపైకి వస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్ విధించడాన్ని రైతులు తప్పుపట్టారు. పోలీసులు అడ్డుకున్న ర్యాలీ చేసి తీరుతామని తేల్చిచెప్పారు.
తుళ్లూరులో అమరావతి రైతులు భారీ ప్రదర్శన: మరోవైపు రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపులపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, ఆ ముసుగులో ప్రభుత్వం అమరావతి విధ్వంసానికి పథక రచన చేస్తోందని రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలను అడ్డుకుంటుంటే.. ప్రభుత్వం తమపై దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్‌లోనే 5 శాతం భూమిని కేటాయించినా.. దాన్ని వదిలి రాజధానిని నాశనం చేయడానికి ఆర్-5 జోన్ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు.
ఆర్-5 జోన్ విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఉదయం తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి స్థానిక సీఆర్డీఏ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ‘అక్రమ ఆర్-5 జోన్ వెంటనే రద్దు చేయాలి’, ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని’, ‘రైతులకు ప్లాట్లు కేటాయించిన ఆర్-3 జోన్‌లోనే పేదలకూ ఇళ్లు కట్టివ్వాలి’.. అంటూ నినదించారు. ‘పేదలారా.. మరోసారి మోసపోవద్దు’, ‘సెంటు భూమి వద్దు.. టిడ్కో ఇళ్లు ముద్దు’, ‘అమరావతి 2 జిల్లాలది కాదు.. 5 కోట్ల ఆంధ్రులది’ అని రాసిన ప్లకార్డులను రైతులు ప్రదర్శించారు.
ఇవీ చదవండి: