విశాఖ కాపులుప్పాడ ప్రాంతంలో ...ఎత్తైన కొండలపై సుమారు 500 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద డేటా పార్క్ అందుబాటులోకి రానుంది. 70వేల కోట్ల రూపాయలతో అదానీ గ్రూప్ దీనిని అందుబాటులోకి తీసుకురానుంది. పూర్తిగా పర్యావరణ హిత ఇంధన వనరులతో దీని నిర్మాణం జరుగుతోంది.
రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికే 175 ఎకరాల భూమిని కేటాయించింది. 30కోట్ల రూపాయల వ్యయంతో 6.6 కిలోమీటర్ల మేర విశాలమైన రహదారులు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోంది. జి.చోడవరం, నకప్పల్లిలో మరో 325 ఎకరాల విస్తీర్ణంలో డేటాపార్క్ పనులు చేపట్టనున్నారు. 10 సంవత్సరాల వ్యవధిలో దశల వారీగా నిర్మాణం చేపడతామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ డేటా పార్క్ లో వివిధ డేటా సెంటర్లు ఏర్పాటు అవ్వనున్నాయి. అదాని గ్రూప్ డేటా సెంటర్లకు అనువైన ఎకో సిస్టమ్ ను ఏర్పాటు చేయనుంది. ప్రపంచ ప్రఖ్యాత క్లౌడ్ సెంటర్ల ఏర్పాటుకు విశాఖ కేంద్రంగా నిలవనుంది. ఈ పార్క్ లో 5 గిగా వాట్ సామర్థ్యం ఉండనుంది. తొలిదశ ప్రాజెక్టు 18నెలల్లో పూర్తి చేయడమే అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.