Polavaram Diaphragm Wall Damage : గోదావరి వరదలకు దెబ్బతిన్న పోలవరం డయాఫ్రంవాల్ సామర్థ్య పరీక్షలు అసంపూర్తిగానే మిగిలాయి. ప్రాజెక్ట్‌లో ఎంతో కీలకమైన గోదావరిలో అంతర్భాగంలో ఉన్న ఈ గోడ సామర్థ్యం పరిశీలనకు వచ్చిన నిపుణులకు పెద్ద ఎత్తున నిలిచి ఉన్న నీరు ఆటంకంగా మారింది. గోడ మంచిగా ఉన్న చోట పరీక్షించగలిగినా ధ్వంసమైన 680 మీటర్ల ప్రదేశంలో అవాంతరాలు ఎదురైనట్లు సమాచారం.
2020 లో ధ్వంసమైన డయాఫ్రం వాల్ : పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధానమైన రాక్ ఫిల్ డ్యాం నిర్మించే చోట గోదావరి గర్భంలో ఊట నీరు నియంత్రించేందుకు డయాఫ్రం వాల్ నిర్మించారు. గోదావరి అడుగుభాగం నుంచి నీరు ఒకవైపు నుంచి మరొక వైపు రాకుండా కట్టడి చేయడమేగాక డ్యాం నిర్మాణానికి భద్రత కల్పించడంలో ఇది అత్యంత ముఖ్యమైనది. విదేశీ పరిజ్ఞానంతో నదీ గర్భంలో 300 అడుగుల లోతు నుంచి నిర్మించుకుంటూ వచ్చారు. కొన్నిచోట్ల 90 అడుగుల్లో నిర్మించారు. 2020 లో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ ధ్వంసమైంది.
ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్ద ఎత్తున ఇసుక కోతకు గురై, పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రాజెక్టు పనులకు అంతరాయాలు ఎదురయ్యాయి. అసలు డయా ఫ్రం వాల్ ఎలా ఉందో, సామర్థ్యం మేర పని చేస్తుందో లేదో తెలుసుకోవడం కీలకంగా మారింది. జాతీయ జల విద్యుత్ పరిశోధన స్థానం డయాఫ్రం వాల్ సామర్థ్యం పరీక్షించేందుకు ముందుకొచ్చింది. జనవరి నాలుగో వారంలో ప్రారంభమైన పరీక్షలు ఫిబ్రవరి రెండో వారానికల్లా పూర్తయ్యాయి. అయితే నదిలో వరద నీరులేని డయా ఫ్రం వాల్ ధ్వంసమవ్వని ప్రాంతంలో మాత్రమే పరీక్షించారు. నీరు ఎక్కువగా ఉండటంతో ధ్వంసమైన ప్రాంతంలో డయాఫ్రం వాల్ పరీక్షించడం సాధ్యపడలేదని తెలుస్తోంది.
మార్చి 5 న సమావేశం : ప్రధాన డ్యాం నిర్మించే చోట డయాఫ్రం వాల్‌ను రెండు భాగాలుగా నిర్మించారు. ఒకటవ భాగంలో దాదాపు 5 వందల మీటర్ల పొడవున ఇటీవలే పూర్తి చేశారు. 2020 వరదలతో దీనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రధాన డ్యాం రెండో గ్యాప్‌లో 1,750 మీటర్ల పొడవున వాల్ నిర్మించారు. ఇది 2020 లో వచ్చిన వరదలకు సుమారు 680 మీటర్ల వరకు ధ్వంసమైంది. అక్కడి నుంచి 1,612 మీటర్ల వరకు గోడ మంచిగా ఉంది. ఈ ప్రాంతంలోనే ఎన్‌హెచ్‌పీసీ ఎలక్ట్రోడ్లను ఏర్పాటు చేసి అధునాతన విధానంలో సామర్థ్యాన్ని పరీక్షించింది.
ధ్వంసమైన 680 మీటర్ల ప్రదేశంలో డయాఫ్రం వాల్ సామర్థ్యాన్ని పరీక్షించడం సాధ్యం కాలేదు. ఇక్కడ అధికంగా ఉన్న వరద నీటిని ఎంత ఎత్తిపోసినా పూర్తిగా ఖాళీ చేయడానికి వీలుపడకపోవడం వల్ల అక్కడ ఎలక్ట్రోడ్లు ఏర్పాటు చేయలేకపోయారు. తమ అధ్యయన వివరాలన్నింటిపై ఎన్‌హెచ్‌పీసీ బృందం త్వరలోనే నివేదిక తయారు చేయనుంది. ఈ నివేదికపై పోలవరం ప్రాజెక్టు క్షేత్రంలో మార్చి 5 న జరిగే సమావేశంలో సమీక్షించనున్నారు.
ఇవీ చదవండి