Pawan Kalyan Varahi Vijaya Yatra: వారాహి విజయ యాత్రలో భాగంగా.. ఏలూరులో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన నాయకులు, వీరమహిళలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు పలు విమర్శలకు తావిస్తుండటంతో.. దానిపై స్పందించారు. మరోసారి యువతులు అదృశ్యం గురించి చెప్తూ.. అందరు వాలంటీర్లూ ఇదే పని చేస్తున్నారని చెప్పనని.. వాలంటీర్లు కొన్ని చోట్ల ప్రజలను బెదిరిస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నప్పడు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు అని అడిగారు. విలువైన సమాచారాన్ని వాలంటీర్లు ఎందుకు సేకరిస్తున్నారని పవన్ నిలదీశారు.
యువత సామర్థ్యాన్ని అంచనా వేయడం లేదు: వాలంటీర్ల పొట్ట కొట్టడం నా ఉద్దేశం కాదన్న పవన్.. యువత సామర్థ్యాన్ని జగన్ సరిగ్గా అంచనా వేయడం లేదని విమర్శించారు. 5 వేల రూపాయలు ఇచ్చి యువతతో ఊడిగం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు వచ్చేంత కూడా వాలంటీర్లకు రావడం లేదని అన్నారు. డిగ్రీ చదివి 5 వేల రూపాయలకు చేస్తున్నారంటే ఏమిటి అర్థమని ప్రశ్నించారు.
మరోసారి అవే వ్యాఖ్యలు: శ్రమ దోపిడీ చేసే జగన్.. క్లాస్‌వార్ గురించి మాట్లాడుతారా అని నిలదీశారు. రాష్ట్రంలో మహిళలు భారీ సంఖ్యలో అదృశ్యం అవుతున్నారని మరోసారి పవన్ అన్నారు. మహిళల అదృశ్యంపై కేంద్ర నిఘావర్గాలు స్టడీ చేస్తున్నాయని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉద్దేశం వేరే కావచ్చని అన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎటు వెళ్తుందో ఎవరికి తెలుసంటూ ప్రశ్నించారు.
"మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం".. ఏలూరు సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు
అవసరానికి మించి సమాచారం ఇవ్వద్దు: వాలంటీర్ల సమాచారం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఉండాలని సూచించారు. వాలంటీర్లపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్ ఉండాలని.. అదే విధంగా వాలంటీర్ వ్యవస్థ పట్ల కచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించారు. ప్రజాధనం తీసుకుని వైసీపీకి పనిచేసే వారిపై దృష్టి పెట్టాలని పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్లకు అవసరానికి మించి సమాచారం ఇవ్వద్దని.. వాలంటీర్ల వ్యవస్థ ప్రమాదకరంగా మారుతోందని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జనవాణి కార్యక్రమంలో: అంతకుముందు పవన్ జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు, ఆశా కార్యకర్తలు, దివ్యాంగులు పవన్‌ను కలిశారు. రేషన్ డీలర్ల సంఘం పపన్కు వినతిపత్రం ఇచ్చారు. డీలర్లు తప్పు చేస్తున్నారని చెప్పి కొత్త వ్యవస్థ తెచ్చారని.. దీంతో ప్రభుత్వానికి తాము సవతి పుత్రులుగా మారిపోయామని రేషన్ డీలర్లు వాపోయారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. కళాశాల నుంచి శ్మశానాల వరకూ ఎన్నో సమస్యలు తన దృష్టికొచ్చాయని.. వాటిలో కొన్నింటిని అయినా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా కొన్నింటిని ప్రభుత్వ శాఖలు దృష్టికి తీకుకెళ్తానని అన్నారు. మరికొన్నింటిపపై పార్టీ పరంగా పోరాడతామని చెప్పారు.