Tenth Students Murdered Fourth Class Student : ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పులి రామన్నగూడెం గిరిజన సంక్షేమ వసతి గృహం విద్యార్థి హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది. ఆ బాలుడిని ఎవ్వరు, ఎందుకు హత్య చేసి ఉంటారా అని సవా లక్ష ప్రశ్నలు తలెత్తాయి. ఈ మిస్టరీని పోలీసులు 48 గంటల్లో ఛేదించి ఉన్నతాధికారులతో ప్రశంసలు పొందారు. అదే వసతి గృహంలో చదువుకుంటున్న సీనియర్ విద్యార్థులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మీడియా సమావేశంలో వెల్లడించారు.
సీనియర్ విద్యార్థులు ఎందుకు చంపారు? : బుట్టాయగూడెం మండలం ఉర్రింక గ్రామానికి చెందిన గోగుల అఖిల్ వర్ధన్ రెడ్డి (9) పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటూ నాలుగో తరగతి చదువుకుంటున్నాడు. ఈ నెల 10 వ తేదీన రాత్రి సమయంలో నిద్రపోతున్న గోగుల అఖిల్ వర్ధన్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు బయటకు తీసుకెళ్లారు. అనంతరం హత్య చేశారు. పీక నొక్కి, మెడ నులిమి, కళ్లపై గుద్ది చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అతడి చేతిలో ఓ లేఖ పెట్టారు. దీనిపై బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.
ఈ దర్యాప్తులో వారికి ఆశ్యర్యం కలిగించే విషయాలు తెలిశాయి. నాలుగో తరగతి చదువుతున్న అఖిల్ వర్థన్ రెడ్డితో పదో తరగతి విద్యార్థుకు పాత కక్షలు ఉన్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు రాత్రి అనుకున్న పథకం ప్రకారమే నాలుగో తరగతి విద్యార్థిని హత మార్చినట్లు విచారణలో తేలింది. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ మైనర్లు కావటంతో జేజేబీ యాక్ట్ ప్రకారం వారిని జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు.
ప్రశాంసాపత్రాలు, నగదు రివార్డులు : ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోని డీజీపీ కేవీ రాజేంద్ర నాధ్ ఆదేశాల మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి పర్యవేక్షణలో అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, పోలవరం డీఎస్పీ ఎ. శ్రీనివాసులు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసు విచారణ చేపట్టారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన కేసులో ప్రతిభ సాధించిన అద నపు ఎస్పీకి, డీఎస్పీకి, జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావుకు, మరికొందరు సీఐలు, ఎస్ఐలకు ఎస్సీ మేరీ ప్రశాంతి ప్రశాంసాపత్రాలు, నగదు రివార్డులు అందజేశారు.