Donated Blood 100 Times: ఏలూరు నగరానికి చెందిన బావిశెట్టి చిరంజీవిరావు వివాహమైన కొత్తలో.. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి రక్తం అవసరం కావడంతో తొలిసారి రక్తదానం చేశారు. అప్పుడే రక్తదాన గొప్పదానాన్ని గుర్తెరిగారు. ఇక అప్పటినుంచి నిర్విరామంగా రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఇటీవల మహిళా దినోత్సవం వేళ.. వందో సారి రక్తదానం చేసి రికార్డు సృష్టించారు.
రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు తరపున చిరంజీవిరావు రక్తదానం చేస్తూ ఉంటారు. ఎవరైనా రక్తం అవసమని ఫోన్ చేస్తే చాలు.. ఎంత దూరమైనా లెక్కచేయకుండా.. వెళ్లి దానం చేస్తుంటారు. ఆపదలో ఉన్న తోటి వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో.. ఈ ఉద్యమాన్ని చేపట్టామని చిరంజీవి రావు చెబుతున్నారు. భర్తతో జీవితంతో పాటు ఆయన ఆశయాన్ని పంచుకుంటున్న చిరంజీవిరావు సతీమణి పద్మావతి.. పెళ్లైన నాటి నుంచే రక్తదానం చేయడం ప్రారంభించారు. 40 సార్లకు పైగా రక్తదానం చేయడమే కాదు.. ఈ మంచి పని ఆవశ్యకతను పిల్లలకు తెలియజేసి వాళ్లూ బృహత్ కార్యంలో పలుపంచుకొనేలా చేశారు. బంధువులు, స్నేహితులనూ రక్తదానం విషయంలో చైతన్యపరుస్తున్నారు.
ఆరు పదుల వయసు దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ తనకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తలేదని.. వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యం సహకరించినంత వరకు రక్తదానం చేస్తానని చిరంజీవిరావు చెబుతున్నారు. చిరంజీవి రావు ఇన్నిసార్లు రక్తదానం చేయడంపై వైద్యులు కొనియాడుతున్నారు. ఆయన్ని సన్మానించి అభినందించారు. రక్తదానంలో మాత్రమే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే చిరంజీవి రావు కుటుంబం ఎన్నో పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందుకుంది. సేవా స్ఫూర్తిని సమాజానికి చాటుతూ ఆదర్శంగా నిలుస్తోంది.
"ప్రపంచంలో మనిషి ఏదైనా ప్రత్యామ్నాయం చేయచ్చు.. కానీ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. దానిని మనం ప్రతి మూడు నెలలకు ఒక సారి ఇవ్వడం వలన.. మన ఆరోగ్యం బాగుచేసుకుంటూ.. ఒక ముగ్గురికి ఉపయోగపడేలా చేయచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం అనేది అలవాటు చేసుకుని.. నేను, నా కుటుంబ సభ్యులు అందరూ చేస్తుంటాం. ఇది మా దినచర్యగా మారిపోయింది. రక్తం ఇవ్వడం వలన ఎంత మేలు జరుగుతుందో తెలుసుకోగలిగాం". - బావిశెట్టి చిరంజీవి రావు, రక్తదాత
"1987 నుంచి మేము రక్తం ఇవ్వడం మొదలు పెట్టాం. అప్పటి నుంచి ఆపలేదు. దీనిని ఒక ఉద్యమంగా తీసుకొని.. మా పిల్లలను కూడా ప్రోత్సహించాను. ప్రజలకు ఉపయోగపడాలి అని.. రక్తదానం చేస్తున్నాం". - బావిశెట్టి పద్మావతి, చిరంజీవిరావు భార్య
ఇవీ చదవండి: