Arrest of TDP leaders: రోడ్డు వేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇవ్వడానికి పాదయాత్ర చేస్తూ బయల్దేరిన టీడీపీ నాయకులను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్1 నిషేధాజ్ఞలు అమలులో ఉండగా పాదయాత్ర చేయడానికి అనుమతులు లేవని పోలీసులు వారించారు. ఈ సందర్భంగా పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ స్టేషన్ వద్ద నాయకులు ఆందోళన నిర్వహించారు.
దీనిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు మాట్లాడుతూ గత ఏడాది జూలై నెలలో మైసన్నగూడెం పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే ఎలిజాను అడ్డుకొని రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందించామన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికి ఆరు నెలలు గడుస్తున్నా నేటికీ తట్ట మట్టి కూడా వేయలేదని పేర్కొన్నారు. దీంతో రహదారి పూర్తిగా శిథిలమై దాదాపు 20 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రహదారి నిర్మాణం చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చేందుకు పాదయాత్ర చేపట్టామన్నారు. ఈ క్రమంలో అనుమతులు లేవంటూ పోలీసులు తమను అడ్డుకోవడం అన్యాయమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి: