కొల్లేరు సరస్సును బడా ప్రముఖులు కొల్లగొట్టేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులు అండదండలు అందిస్తున్నారు. సాక్షాత్తూ కొందరు అటవీ అధికారుల ఆశీస్సులతోనే ఈ తతంగం సాగుతోందనేది బహిరంగ చర్చగా మారింది. సుప్రీంకోర్టు సాధికార కమిటీ జోక్యంతో 2006లో కొల్లేరు ఆక్రమణలను తొలగించినా ఎప్పటికప్పుడు మళ్లీ కొల్లగొట్టే ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతున్నాయి. అధికారులు నామమాత్రంగా కేసులు పెట్టడం తప్ప కొల్లేరు నడి గర్భంలోనూ యథేచ్ఛగా చెరువులు ఏర్పాటుచేసి సాగు చేసుకుంటున్నా ఏమీ చేయలేకపోతున్నారు. కొల్లేరు +5 కాంటూరు పరిధిలో ఉన్న 76,243 ఎకరాల్లో తవ్వకాలు చేపట్టకూడదు. 1999లోనే ప్రభుత్వం ఇచ్చిన జీవో 120 ప్రకారం ఐదో కాంటూరు పరిధిలో ఉన్న ఈప్రాంతం అభయారణ్యం. అయితే ఇప్పటికీ ఆ పరిధిలో కొత్త ఆక్రమిత చెరువులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మంగళవారం ఈనాడు, ఈటీవీ భారత్ ప్రతినిధులు ఈప్రాంతాలను సందర్శించినప్పుడూ ఇవే దృశ్యాలు కళ్లకు కట్టాయి.
తాజాగానూ కొల్లేరులో కొత్త తవ్వకాలు, పాత చెరువుల బాగుచేత పేరుతో గట్లు పెంచుతూ వందల ఎకరాలు ఆక్రమిస్తూనే ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధుల అండదండలతో పాటు కొందరు అధికారులు కళ్లు మూసుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోంది. కైకలూరు మండలం చటాకాయి, భుజబలపట్నం, ఏలూరు మండలం పెద్దయాగనపల్లిలతో పాటు పైడిచింతలపాడు, కొక్కిరాయలంకల్లో యథేచ్ఛగా పొక్లెయిన్లు పని చేస్తున్నాయి. ట్రాక్టర్లు చదును చేసి చెరువులను సిద్ధం చేస్తున్నాయి.
ఊరి అవసరాల పేరుతో...
కైకలూరు మండలంలోని చటాకాయి, భుజబలపట్నం గ్రామాల్లో కొల్లేరులోనే తవ్వకాలు సాగాయి. చటాకాయి గ్రామంలో కొల్లేరు సరస్సులో ఒకవైపు పెద్ద గట్లు పోశారు. నాలుగు వైపులా గట్లు పూర్తి చేస్తే 50 ఎకరాల చెరువుగా మారేది. చటాకాయి ఊళ్లోకి వచ్చే వరదను అడ్డుకోవడానికే గట్టు నిర్మించామని అక్కడివారు చెబుతున్నారు. మరోవైపు భుజబలపట్నంలోనూ పెద్ద చెరువు తవ్వేశారు. ఇందులో కొల్లేరు అభయారణ్యానికి బయట కొంత, కొల్లేరు సరస్సులోని కొన్ని ఎకరాలు కలిసి ఉన్నాయని అక్కడ తవ్వినవారే అంగీకరిస్తున్నారు. ఈ రెండుచోట్లా అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి పొక్లెయిన్లు సీజ్ చేశారు. గట్లకు అక్కడక్కడ గండి పెట్టినా తర్వాత వాటిని పూడ్చి చెరువులుగా మార్చేయడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అదే తరహాలోనే కొత్త చెరువులు వస్తున్నాయి. భుజబలపట్నంలో జాతీయ రహదారి నిర్మాణం వల్ల ఊరి మంచినీటి చెరువు దెబ్బతింటోందని, అందుకోసమే తమ ఊరివారమంతా కలిసి ఈ చెరువు తవ్వుకున్నామని ఆ చెరువు వద్ద ఉన్న వారు చెబుతున్నారు. ఈ రెండుచోట్లా వాహనాలు, పొక్లెయిన్లు సీజ్ చేశామని, కేసులు నమోదు చేశామని డిప్యూటీ రేంజి అధికారి జయప్రకాష్ చెప్పారు.
అనుమతులు ఉన్నాయంటూ తవ్వకాలు
ఏలూరు మండలంలో తవ్వకాల తీవ్రత ఎక్కువగానే ఉంది. పెద్దయాగనపల్లిలో దాదాపు 200 ఎకరాల్లో ఒక ఎమ్మెల్యే అండతో చెరువులు తవ్వుతున్న విషయం వెలుగుచూసిన తర్వాత కూడా ఇంకా అక్కడ చెరువుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. పైడిచింతలపాడు, కొక్కిరాయలంక సమీపంలో పెద్ద ఎత్తున చెరువులు తవ్వేస్తున్నారు. పక్క పక్కనే రెండు వేర్వేరు చెరువులు సిద్ధం చేస్తున్నారు. 20కి పైగా ట్రాక్టర్లు, అయిదారు పొక్లెయిన్లు నిర్విరామంగా పని చేస్తున్నాయి. కనీసం అధికారులు ఎవరూ అటు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పైగా జిల్లా ఆక్వా అథారిటీ తమకు 20 ఎకరాల్లో చెరువుల తవ్వకానికి అనుమతి ఇచ్చిందని అక్కడివారు కాగితం చూపించారు. పైడిచింతలపాడులోని కొన్ని సర్వే నెంబర్లను పేర్కొంటూ 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మంచినీటి చేపల చెరువు తవ్వుకునేందుకు అనుమతి ఉందన్నారు. దీనిపై అక్కడి రెవెన్యూ సిబ్బందితో మాట్లాడితే పైడిచింతలపాడు జిరాయితీ భూముల్లో ఆ చెరువును బాగు చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఒక రెవెన్యూ అధికారిని ప్రశ్నిస్తే కొల్లేరు అభయారణ్యంలోని తవ్వకాల అంశం అటవీశాఖ పరిధిలోనే ఉందని.. ప్రభుత్వం మొత్తం వారికే అప్పగించిందన్నారు. ఇప్పుడే తమకు తెలిసినందున అటవీశాఖాధికారులకు తెలియజేస్తామన్నారు. అక్కడ రెండు లారీలు ఒకేసారి ఎదురెదురుగా వెళ్లగలిగేంత పెద్ద గట్టు నిర్మిస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంలో జిరాయితీ భూముల్లో చెరువుల తవ్వకానికి వీల్లేదు. పాత చెరువు బాగు చేసుకునేందుకు అవకాశం లేదు. 2021 డిసెంబరులో అప్పటి జిల్లా కలెక్టర్ జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు కొల్లేరు ఆక్రమణలపై తాజాగా నివేదిక ఇచ్చారు. కొల్లేరు +5 కాంటూరు లోపు, +3 కాంటూరులోపు ఉన్న ప్రాంతాన్ని మార్కింగ్ చేసి సమర్పించిన మ్యాప్ కూడా అందులో ఉంది. ఈ మ్యాప్ ప్రకారం చూస్తే ప్రస్తుతం విస్తృతంగా తవ్వకాలు సాగుతున్న ప్రాంతం కొల్లేరు అభయారణ్యంలోనే ఉన్నట్లు అర్థమవుతుంది. అక్కడ తవ్వకాలు సాగుతున్న పరిస్థితులన్నీ వన్యప్రాణి జీవనానికి అంతరాయం కలిగించే స్థితిలోనే కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఏలూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి