తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని బలుసులపేటకు చెందిన దళిత యువకుడు ఆలపు గిరీష్‌బాబు (24) బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైకాపాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశానన్న కక్షతో, తప్పుడు కేసు పెట్టించి, పోలీసులతో కొట్టించి తన తమ్ముడి చావుకు కారణమయ్యారంటూ మృతుడి సోదరుడు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కుటుంబీకులు ఉదయం 10.30 గంటలకు సామర్లకోట పోలీసు స్టేషన్ మెట్ల దగ్గర మృతదేహం ఉంచి ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
‘నేను మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాను ఎదుర్కొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశా. దీంతో వైకాపా నాయకులు మా కుటుంబంపై కోపం పెంచుకున్నారు. దొంగతనం, అత్యాచారయత్నం చేశాడని వాలంటీరు, ఆమె భర్త తప్పుడు ఫిర్యాదు చేస్తే.. అధికార పార్టీ కౌన్సిలర్, ఇతర నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు తప్పుడు కేసు కట్టారు. ఎస్సై నా తమ్ముణ్ని రోజూ స్టేషన్‌కు పిలిపించి శారీరకంగా, మానసికంగా హింసించారు. దీంతో మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడు’
- ప్రవీణ్ కుమార్, మృతుని సోదరుడు
బాధితులకు మద్దతుగా ఎస్సీ సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని.. సాయంత్రం 6 గంటల వరకు ఆందోళన చేశారు. ఒక దశలో పోలీసులు, బాధితులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో మృతుని తల్లితోపాటు మహిళా హోంగార్డు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని సర్దిచెప్పినా మృతుడి కుటుంబీకులు శాంతించకపోవడంతో అందర్నీ బలవంతంగా పక్కకు తప్పించి.. మృతదేహాన్ని అంబులెన్సులో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. తన తమ్ముడిపై తప్పుడు కేసు పెట్టారని, మీ అబ్బాయిని స్టేషన్‌కు పంపకపోతే నిన్ను బట్టలిప్పి తంతానని తమ తండ్రిని ఎస్సై బెదిరించారని గిరీష్ సోదరుడు ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వాలంటీరు భర్తే చొక్కా పట్టుకున్నారు...
ఈ నెల 1న సచివాలయం నుంచి సంక్షేమ కార్యదర్శి ఫోన్ చేస్తే నేను, గిరీష్ కలిసి బలుసులపేట వెళ్లాం. అక్కడ మాట్లాడుతుండగా పక్కనే ఉన్న వార్డు వాలంటీరు, ఆమె భర్తతో సీఎఫ్‌ఎంఎస్ ఐడీ అంశంపై మాట్లాడుతున్నారు. సీఎఫ్‌ఎంఎస్ ఐడీ ఆలస్యమవుతుందని వ్యాఖ్యానించడంతో నువ్వెవరు మాకు చెప్పడానికి అంటూ మాతో వాగ్వాదానికి దిగారు. గిరీష్ అడ్డుకోగా వాలంటీరు భర్త తన చొక్కా పట్టుకున్నారు. తరువాత గొడవ సద్దుమణిగింది. ఆ సంఘటనకు, నమోదు చేసిన కేసులకు సంబంధం లేదు. సామర్లకోట నాయకులు, కౌన్సిలర్ కలిసి ఎస్సైతో ఇలా చేయించారు. మాకు న్యాయం చెయ్యాలి.
- భానుప్రసాద్, గిరీష్ మిత్రుడు
విచారణ జరిపిస్తాం..
గిరీష్ మరణానికి మహిళా వాలంటీరు, ఆమె భర్త అన్యాయంగా కేసు పెట్టడమే కారణమని.. ఎస్సై కుర్రాడిని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి కొట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి, న్యాయం చేస్తాం.
- డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు
ఇవీచదవండి.