తన భర్త మరణంపై అనుమానం ఉందని, న్యాయం కోసం పోరాడుతున్న తనకు ప్రాణ హాని ఉందని ఓ మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిన తేతలి రమ అనే మహిళ.. తేతలి సత్తిరాజుతో కలిసి 20ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే సత్తిరాజు అకస్మాత్తుగా మరణించడంతో.. తన భర్త మృతిపై అనుమానం ఉందని స్థానిక పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టింది. తనకు తన ఇద్దరు పిల్లలకు ప్రాణహాని ఉందని వాపోయింది. తన భర్త మృతిపై.. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకకృష్ణా రెడ్డి సహా మరికొందరిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగిందంటే..
అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డికి.. తేతలి సత్తిరాజు వరసకు బావమరిది అవుతారు. అయితే కొంత కాలం క్రితం రమ అనే మహిళతో కలిసి సహజీవనం చేస్తున్న సత్తిరాజు.. కుటుంబాన్ని వదిలేసి వేరే చోటకు మకాం మర్చాడు. అయితే కుటుంబానికి దూరంగా ఉంటున్న సత్తిరాజు ఆస్తులను.. నల్లమిల్లి అక్రమంగా కాజేశాడని రమ ఆరోపించింది. తన భర్త అకస్మాత్తుగా మృతి చెందటానికి వారే కారణమంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు పోస్టుమార్టం రిపోర్టులు పరిశీలించాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాగైనా తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.
ఇదీ చదవండి: 'సీఎం సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది'