తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడరేవు వినగానే స్థానిక చేపల రేవు గుర్తుకొస్తుంది. రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం గల ఈ రేవులో వింత చేపలు దర్శనమిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇక్కడ లభ్యమయ్యే చేపలను భారీ వాహనాల్లో తమిళనాడు, కర్ణాటక, ఒడిశాతోపాటు తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ రేవు ప్రస్తుతం సమస్యలను ఎదుర్కొంటోంది.
సముద్రంలోకి వెళ్లిన బోట్లు ముందుకు వచ్చేందుకు సరైన దారి లేక కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోతున్నాయి. దీంతో లభ్యమైన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోపక్క కెరటాల తీవ్రతకు రేవు ప్రాంతం కోతకు గురై సముద్రంలో కలిసిపోతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు రేవు ప్రాంతమంతా అస్తవ్యస్తంగా తయారైంది. విద్యుత్ దీపాలు కూడా ధ్వంసం అవడంతో సాయంత్రం అయితే చీకట్లోనే గడపాల్సి వస్తుందని మత్స్యకారులు వాపోతున్నారు.
నూతనంగా హార్బర్ నిర్మిస్తామని పాలకులు పదేళ్లుగా చెబుతున్నారే తప్ప పనులు మాత్రం మొదలు కాలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను దృష్టిలో ఉంచుకొని హార్బర్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..