సాధారణంగా ఏ శివాలయాల్లో అయినా శివుడు లింగం రూపంలో ఒక చోట, పార్వతీ దేవి మరో గర్భగుడిలో కొలువై ఉండటాన్ని చూస్తుంటాం. కానీ ఉమాకొప్పేశ్వరస్వామి క్షేత్రంలో శివుడు... పార్వతి, గణపతి, కుమారస్వామితో ఒకే గర్భగుడిలో దర్శనమిస్తాడు. మొదట్లో ఇక్కడ శివుడిని ఉమా అగస్త్యేశ్వరస్వామిగా పిలిచినా ఓ పూజారిని కాపాడేందుకు స్వామి కొప్పు ధరించినందుకు కొప్పేశ్వరుడు అనే పేరు వచ్చిందనీ ప్రతీతి. శివుడు స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని పలివెలలో ఉంది.
స్థలపురాణం
పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి కైలాసంలో జరిగే పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని చూడలేకపోయినందుకు బాధపడుతూ శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడట. దానికి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనప్పుడు అగస్త్యుడు కల్యాణ దంపతుల రూపంలో తనకు దర్శనం ఇవ్వమని అడుగుతూనే తానున్న ప్రాంతంలోనే స్థిరపడమని కోరాడట. మహర్షి కోరికను మన్నించిన స్వామి పార్వతి, కుమారులతో కలిసి ఇక్కడ వెలిశాడని అంటారు. అప్పటినుంచీ శివుడిని అగస్త్యేశ్వరుడిగా, పార్వతిని ఉమాదేవిగా పూజించడం మొదలుపెట్టారట.
ఉమాకొప్పేశ్వరస్వామి
కొన్నాళ్లకు అంటే... క్రీ.శ.8 వ శతాబ్దంలో చాళుక్య భీముడు అనే రాజు సామర్లకోటలోని కొన్ని ఆలయాలను పునరుద్ధరించి మిగిలిన శిలలతో ఇప్పటి పలివెలలో ఉన్న ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసి రోజూ శివుడికి పూల మాలలు పంపించేవాడట. అయితే ఇక్కడి అర్చకుడు స్వామికి రోజంతా భక్తివిశ్వాసాలతో పూజలు చేసినా, సాయంత్రమయ్యేసరికి వేశ్యల దగ్గరకు వెళ్లేవాడట. అంతేకాదు శివార్చనకు ఉపయోగించాల్సిన పూలను సైతం మొదట వేశ్యల తలల్లో పెట్టి తరువాత వాటినే తెచ్చి శివుడికి అలంకరించే వాడట. దాంతో కొందరు భక్తులు రాజుకు ఫిర్యాదు చేశారట. అసలు విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఓరోజు రాజే ఆలయానికి వచ్చాడట. పూజాది కార్యక్రమాలు అయ్యాక శివలింగంపైన ఉన్న ఓ పూలమాలను తీసి రాజు మెడలో వేశాడట అర్చకుడు. ఆ దండలో ఓ వెంట్రుక కనపడటంతో రాజు అదెలా వచ్చిందని పూజారిని ప్రశ్నించాడట. అర్చకుడు వెంటనే ఇక్కడ శివుడికి కొప్పు ఉంటుందని చెప్పాడట. ఆశ్చర్యపోయిన రాజు... ఆ కొప్పును చూడాలన్నాడట. పూజారి వెంటనే... 'ఒకసారి స్వామికి అభిషేకం నిర్వహించి, నాగాభరణం అలంకరించాక తీయడం కుదరదనీ, మర్నాడు అభిషేకం సమయంలో చూపిస్తా'ననీ చెప్పాడట. రాజు ఆ రాత్రి అక్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నాక భయపడిన అర్చకుడు గర్భగుడిలోకి వెళ్లి... తనని క్షమించి కాపాడమనీ, ఇకపైన తన వ్యసనాన్ని వదిలేస్తాననీ శివుడిని వేడుకున్నాడట. దాంతో పూజారిని క్షమించిన స్వామి తన తలపైన కొప్పును సృష్టించుకున్నాడట. మర్నాడు యథావిథిగా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక శివలింగంపైన అలంకరించిన ఓ దండను తీసి పూజారి రాజుకు ఇచ్చాడట. అందులోనూ వెంట్రుక కనపడటంతో లింగంపైనున్న కొప్పులోంచి ఓ వెంట్రుక తీసిమ్మంటూ రాజు హుకుం జారీచేశాడట. ఆ తర్వాత పూజారి కొప్పును చూపించడంతో రాజు పశాత్తాపంగా దేవాలయానికి దక్షిణ దిక్కున ఉన్న జిత్తుగపాడు అనే గ్రామాన్ని ఆలయానికి రాసిచ్చాడట. అప్పటినుంచీ స్వామిని ఉమాకొప్పేశ్వరస్వామిగా పిలుస్తున్నారని అంటారు.
విశేష పూజలు
దుర్వ్యసనాల బారిన పడినవారిని ఈ ఆలయానికి తీసుకొచ్చి ప్రదక్షిణలు చేయించి ఏకాదశ రుద్రాభిషేకం, ఉమాదేవికి కుంకుమార్చన చేస్తే వాటినుంచి త్వరగా బయడపడతారని అంటారు. ఇక్కడ మహాశివరాత్రి సమయంలో స్వామికి కల్యాణం చేసి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. కన్నులపండుగ్గా జరిగే ఈ రథోత్సవాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు.
ఎలా చేరుకోవాలి
ఈ ఆలయం రాజమహేంద్రవరానికి యాభై కిలోమీటర్లూ, రావులపాలెంకి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాలకు బస్సులూ లేదా రైల్లో చేరుకుంటే అక్కడినుంచి బస్సులూ, ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
ఇదీ చదవండి: Tirumala: తిరుపతిలో వీఐపీ దర్శన టికెట్ల కోసం భక్తుల ఆందోళన