తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో తప్పుడు కేసులు పెట్టిన ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. కంగల శ్రీనివాసు, కారం రంగారావు, కత్తుల ఆదిరెడ్డి, కడబాల రాంబాబు తదితరులు సోమవారం ఐటీడీఏ ముట్టడి చేపట్టారు. ఏఎస్పీ కరణం కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి ప్రధాన కూడళ్లలో ఉంటూ ఆందోళనకు వచ్చేవారిని అడ్డుకున్నారు. ముట్టడికి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మద్దతిచ్చారు. ర్యాలీ చేసి అంబేడ్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి ఐటీడీఏ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. ఎమ్మెల్యే ధనలక్ష్మి తీరును విమర్శించారు. పోలీసుల చొరవతో 20 మందితో చర్చించేందుకు పీవో అనుమతించారు. డిమాండ్లపై సరిగా స్పందించకపోవడంతో వారంతా బయటకు వచ్చి నిరసన తెలిపారు. రాష్ట్ర జేఏసీతో చర్చించి ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు. మట్ల వాణిశ్రీ, పల్లాల రాజ్‌కుమార్‌రెడ్డి, కారం శేషాయమ్మ, రమణ, రామారావు దొర, గంగరాజు, మంగిరెడ్డి పాల్గొన్నారు.
నేలపై కూర్చోబెట్టి అవమానించారు..
ఆదివాసీలతో చర్చలకు పిలిచిన ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య తనతోపాటు ఆదివాసీ నాయకులను నేలపై కూర్చోబెట్టి అవమానించారని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు.