తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రవాహం తగ్గినా.. దిగువ ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఎగువ నుంచి నీటి రాక తగ్గి ఉపనదులు శాంతించాయి. దేవీపట్నం, చింతూరు, ఎటపాక, కూనవరం మండలాల్లో 88 గిరిజన గ్రామాలకు కొంత ఊరట దక్కింది. దేవీపట్నంలో ఇవాళ సాయంత్రానికి ముంపు వీడే అవకాశం ఉంది. 36 గ్రామాలకు మరో రెండు రోజుల్లో రాకపోకలు మొదలయ్యే అవకాశం ఉంది. ముంపు ఇంకాస్త తగ్గితే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు ప్రారంభమవుతాయి. 12 రోజులుగా ముంపులో ఉన్న తమకు నిత్యావసరాలు అందించాలని మన్యం ప్రజలు కోరుతున్నారు.
ఇంకా ముంపులోనే గ్రామాలు
కోనసీమ లంకల్లోనూ వరద తగ్గుముఖం పట్టినా... ఇంకా అనేక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. 73 లంక గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని మరో 15 గ్రామాలు ముంపు నుంచి తేరుకుంటున్నాయి. ప్రస్తుతానికి రాకపోకలకు పడవలపైనే ఆధారపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పరిస్థితి ఇంకా కుదుటపడలేదు. బడుగువానిలంక సహా పలు గ్రామాలు నీటిలోనే ఉండిపోవడంతో ఇళ్లు పాడైపోయాయి. నిత్యావసరాలు దొరక్క ప్రజలు పాట్లు పడుతున్నారు. రెండోసారి వచ్చిన వరదలో సామాన్లు కొట్టుకుపోయాయని వాపోతున్నారు. పశువుల మేత పంట నీటమునిగి... ఆకలితో మూగజీవాలు బక్కచిక్కిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
కుళ్లిన పంటలు
వరద తగ్గుదలతో.. లంక భూముల్లో 10 రోజులుగా ముంపులో ఉన్న పంటలు క్రమంగా బయటపడుతున్నాయి. కుళ్లిన పంటలను చూసి రైతు గుండె బరువెక్కుతోంది. కోనసీమలో వరద తీవ్రత అధికంగా ఉన్న 15 మండలాల్లో 23 వేల 750 ఎకరాల విస్తీర్ణంలో వరి, అరటి, మునగ, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. కేంద్రపాలిత యానాంలో గౌతమి గోదావరి ఉగ్ర రూపానికి రెండు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాలయోగి వారధి నుంచి కనుచూప మేర వరద చుట్టేసింది. ముంపు ప్రభావిత గ్రామాల్లో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు నిత్యావసరాలు అందజేశాయి.
గోదావరి వరదల కారణంగా జిల్లాలో 26 మండలాల్లోని 180 గ్రామాలు, లక్షా 13 వేల మంది ప్రభావితం అయినట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి : వరద ముంపుతో లంక ప్రజల అవస్థలు