తూర్పుగోదావరి జిల్లాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రవాహం తగ్గిందని ఇళ్లూ వాకిలీ సర్దుకునేలోగా మరోసారి ఉద్ధృతి పెరగ్గా ముంపు గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకేసారి రెండు వరదలు వచ్చి కమ్మేసినట్లైందని వాపోతున్నారు. కోనసీమలోని లంక గ్రామాలే కాకుండా రాజమహేంద్రవరం ఎగువన ఉన్న సీతానగరం మండలంలోని ములకల్లంక సహా పలు గ్రామాలు వారం రోజులుగా నీటిలో నానుతూనే ఉన్నాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏ చిన్న వస్తువు తెచ్చుకోవాలన్నా నావలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. పశుపోషణ మీదే ఆధారపడి జీవిస్తున్న ములకల్లంక ప్రజలను గోదావరి వరద కోలుకోలేని దెబ్బకొట్టింది. వరద ప్రవాహానికి పశుగ్రాసం, పంటలు పూర్తిగా నాశనమైపోగా... వందలాది మూగజీవాలు పస్తులుంటున్నాయి. రెండు రోజుల నుంచి వాటికి ఆహారం అందించలేకపోతున్నామంటూ పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో కోనసీమలోని 15 మండలాల్లో సుమారు 15 వేల 657 ఎకరాల విస్తీర్ణంలో అరటి, తమలపాకు సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. తోటలన్నీ నీటిలోనే ఉండిపోయి.. పూర్తిగా నాశనమయ్యాయని రైతులు వాపోతున్నారు. కొన్నిచోట్ల వ్యవసాయ భూమి కోతకు గురై సాగుకు పనికిరాకుండా పోయిందని.. జీవనాధారం కోల్పోయామని తల్లడిల్లిపోతున్నారు.
ఆలమూరు మండలం పాతూరులో ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందగా... దహన సంస్కారాలు చేసేందుకు కుటుంబీకులు పడరాని పాట్లు పడ్డారు. పడవపై మృతదేహాన్ని చెముడులంకకు..అక్కడ నుంచి రాజమహేంద్రవరానికి తరలించారు. పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరి ఉద్ధృతికి కాటన్ అక్విడెక్ట్ ముంపు బారిన పడింది.
ఇదీ చదవండీ... పులిచింతలకు ఆగని వరద.. దిగువకు నీటి విడుదల