తూర్పుగోదావరి జిల్లా స్థాయి వ్యవసాయ సలహా కమిటీ తొలి సమావేశం కాకినాడలో నిర్వహించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పంటల ప్రణాళికపై ప్రత్యేక దృష్టి సారించాలని.. సీఎం జగన్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. జిల్లాలో మూడు పంటలు సేద్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.
వేలాది మంది రైతులను సలహా మండలిలో సభ్యులుగా చేర్చి వారి సలహాలు, సూచనల మేరకు విధివిధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వంగా ఏపీ సర్కార్ గుర్తింపు పొందిందని అన్నారు. రైతు భాగస్వామ్యంతో ముందుకు సాగితేనే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ- క్రాప్ బుకింగ్ తప్పనిసరి చేసినట్లు చెప్పారు. దీనివల్ల పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించటం సులభమవుతుందన్నారు.
రైతుకు భరోసా కల్పించేందుకు సలహా మండలిలో పలు అంశాలు చర్చించామని మంత్రి వేణు గోపాలకృష్ణ అన్నారు. రైతు సంక్షేమానికి, వారి అభివృద్ధికి సీఎం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు, వ్యవసాయ సలహా కమిటీ నూతన ఛైర్మన్ సాయి, జిల్లా సంయుక్త పాలనాధికారి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: fishing problems: కొవిడ్ ధాటికి డీలాపడిన జాలర్లు