రాజధానిని విడదీస్తే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్టుబడులను తరిమేసి అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం ప్రజలను వంచించడమేనన్నారు. ఏడాదిలో రాష్ట్రంలో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అమరావతిని పూర్తిచేసే సత్తా లేక మూడు రాజధానులంటూ వినాశనం చేస్తున్నారని అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. పాలన చేతకాక కులాల ప్రస్తావన తెస్తున్నారని విమర్శించారు. తెదేపా చేసిన అభివృద్ధి ప్రజలందరికీ కనిపిస్తోందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే పెట్టుబడులు తీసుకురావడమన్న అమర్నాథ్.. విశాఖను ఆర్థిక రాజధానిగా, రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా మార్చామని గుర్తు చేశారు. అనంతపురంలో కియా, తిరుపతిలో శ్రీసిటీ, కర్నూలులో సోలార్ సిటీ ఇందుకు నిదర్శనమన్నారు. అమరావతిని రాష్ట్రం మొత్తానికి ఆదాయం తీసుకొచ్చే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా నిలిపామన్నారు. అలాంటి అమరావతిని కోర్టుల్లో కేసులతో కోల్డ్ స్టోరేజీలో పడేయాలని చూస్తున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడేవారు హంద్రీనీవాకు ఏం చేశారని అమర్నాథ్ రెడ్డి నిలదీశారు.
అభివృద్ధి వదిలేసి మూడు రాజధానులపై దృష్టి
ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధిని వదిలేసి మూడు రాజధానులపై దృష్టి పెట్టారని మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప విమర్శించారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మించాలని అమరావతిని తీసుకురావడం జరిగిందన్నారు. అమరావతి కోసం రైతులందరూ నిస్వార్థంగా భూములిచ్చి సహకరించారన్నారు. అలాంటి రాజధానిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా హయాంలో 160 ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకొచ్చామని గుర్తుచేశారు.
ఓడిపాతామనే భయంతోనే నోరు విప్పట్లేదు
ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు దక్కవనే భయంతో చంద్రబాబు విసిరిన సవాలును స్వీకరించలేదని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఎద్దేవా చేశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయాన్ని తెలుసుకున్న వైకాపా నాయకులు రాజీనామాలపై స్పందించడం లేదని విమర్శించారు. అమరావతి రాజధానిగా ఉండాలని అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం స్వార్థ ప్రయోజనాల కోసం రాజధాని మార్పు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.
ఇవీ చదవండి..