తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిమండలికి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఎవరి దారి వారిదే అన్న చందంగా ఉన్నారని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. జిల్లా అభివృద్ధిపై మంత్రుల సమిష్టి కృషి కనిపించడం లేదన్నారు. జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును విమర్శించడానికే తనకు పదవి ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రైతు సంక్షేమం పక్కన పెట్టి.. ప్రతిపక్ష నాయకుడిని తిట్టడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టు మంత్రులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గోదావరి ఉగ్ర రూపానికి అటు కోనసీమ, ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో అపార పంట నష్టం జరిగిందని చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ప్రజలకు రైతులకు జరిగిన నష్ట ఉపశమన చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విపత్తు నుంచి తేరుకునేలోపే.. భారీ వర్షాలతో ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయని అన్నారు.
జిల్లాలో భారీ వర్షాలతో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు మరోమారు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు అదనపు నీటిని విడదల చేసిన కారణంగా.. పంటలు నీట మునిగి అపార నష్టం జరిగిందన్నారు. ఆయకట్టు పరిధిలో పెద్దాపురం, కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాలపై ప్రభావం పడిందని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఇచ్చే పవర్ టిల్లర్, ట్రాక్టర్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రచార ఆర్బాటానికి ఇచ్చిన ప్రాధాన్యత .. రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తే అన్నదాతలకు ఉపకారం చేసినట్లు అవుతుందని హితవు పలికారు.
ఇదీ చదవండి: