బొమ్మూరు వద్దనున్న తెలుగు సాహిత్యపీఠం ప్రవేశ ద్వారం
తెలుగు వెలుగులు విరజిమ్మిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయ సాహిత్య పీఠానికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. బొమ్మూరు వద్ద 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పీఠానికి విశ్వవిద్యాలయ హోదా కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. గతంలో ఇక్కడ తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీలు చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేవారు. ఆ తరువాత క్రమంగా పరిస్థితులు మారాయి. 2014లో తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఈ పీఠానికి గుండెకాయలాంటి తెలుగు విశ్వవిద్యాలయ కేంద్రం తెలంగాణలోనే ఉండిపోయింది. దాంతో నిర్వహణ కొరవడి.. ఆదరణ కోల్పోతూ వస్తుండడంతో సాహిత్య పీఠంలోని కొంత భూమిని ప్రభుత్వం వివిధ అవసరాలకు కేటాయించింది. అర్బన్ పరిధిలో విశాల ప్రాంగణం కలిగి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయం హోదా కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని విద్యారంగ నిపుణులు, విద్యార్థులు కోరుతున్నారు. ఆ దిశగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు చొరవ చూపాలని వారు పేర్కొంటున్నారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు భాషపై మక్కువతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులో 1989 డిసెంబరు 2న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తరువాత రాజమహేంద్రవరం (బొమ్మూరు)లో నన్నయ ప్రాంగణం పేరుతో సాహిత్య పీఠం, శ్రీశైలంలో పాలుకూరు సోమనాథ ప్రాంగణం పేరుతో చరిత్ర, సంస్కృతి, పురావస్తు పీఠం, కూడిపూడిలో సిద్ధేంద్ర కళాక్షేత్రం పేరుతో నృత్య పీఠాన్ని నెలకొల్పారు.
ప్రస్తుత కార్యాచరణ ఇదీ..
ప్రస్తుతం ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ తెలుగు మాత్రమే అందిస్తున్న ఈ పీఠంలో త్వరలో ఎంఏలో జ్యోతిషశాస్త్రం, జర్నలిజం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం తదితర అంశాలతో ప్రవేశాలను కల్పించేందుకు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిని విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తే స్వతంత్రంగా విధులు నిర్వహించడంతోపాటు సుమారు 40 కోర్సులను అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇది సాకారమైతే రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం కలిగిన ప్రత్యేకత జిల్లాకు దక్కుతుంది.
ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు..
సాహిత్య పీఠం పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాం. తెలుగుభాషాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పీఠాన్ని విశ్వవిద్యాలయంగా మార్చేందుకు సుముఖంగా ఉన్నారు. - ప్రొఫెసర్ వి.నిరీక్షణ్‌బాబు, ఓఎస్‌డీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పీఠం
ఇదీ చదవండి