తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని జీ.ఎం.సీ.బాలయోగి టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్లో 2006 నుంచి యువతకు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న యువతకు ఉపాధి మార్గాలపై శిక్షణ ఇస్తూ.. వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా అవగాహన పెంచుతూ శిక్షణ అందిస్తున్నారు.
ఒక్కో బ్యాచ్‌కి దాదాపు 30 మంది చొప్పున ఎంపిక చేసి స్కిల్ డెవలప్మెంట్పై అనుభవజ్ఞులైన వారితో వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు సంబంధించిన పిల్లలకు.. అలాగే ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పని చేసే యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
పదో తరగతి నుంచి ఆపై విద్యార్థులకు శిక్షణ..
దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం కింద పదో తరగతి ఆపై విద్యార్హత కలిగిన యువతకు కంప్యూటర్, ఆంగ్ల మాధ్యమం, జనరల్ అర్థమెటిక్, రిటైల్ మార్కెటింగ్ వంటి అంశాలపై ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలంలో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తూ రోజుకు 237 రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా చెల్లిస్తోంది.
ఈ అవకాశాన్ని పలువురు చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన యువతకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు బాటలు వేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని శిక్షణ సిబ్బంది పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
సంస్కృతి, తెలుగు భాషలకు జీవం పోస్తున్న గోరంట్ల వెంకన్న ట్రస్టు