తూర్పుగోదావరి జిల్లాలో గత ఖరీఫ్ సీజన్.. రైతులకు కోలుకోలేని దెబ్బ మిగిల్చింది. వరదలు, వరి కోతల సమయంలో తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తూర్పు, మధ్య డెల్టా పరిధిలో రబీలో వరి సాగుపైనే ఆశలు పెట్టుకున్నారు. రబీలో కాస్త అయినా ఆదాయం సమకూరుతుందన్న ఆశతో ఉన్న కౌలు రైతులకు.. సాగునీటి ఎద్దడి కలవరపెడుతోంది. తూర్పు డెల్టా పరిధిలోని కాజులూరు, కరప, కె.గంగవరం, రామచంద్రపురం, పెదపూడి మండలాల్లో నీరు అందక పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి నుంచే వంతుల వారీ విధానంలో సాగునీరు సరఫరా చేస్తున్నారు. డీజిల్ ఇంజిన్లతో నీరు తోడుకోవాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
కోనసీమ పరిధిలోని మధ్య డెల్టాలోనూ వరి పొలాల్లోనూ నీటి ఎద్దడి నెలకొంది. అమలాపురం డివిజన్ పరిధిలో వివిధ మండలాల్లో పంటలకు సరిపడా నీరు అందడం లేదు. సాధారణంగా రబీ సాగు ఈ ప్రాంతంలో ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ప్రకృతి విపత్తులతో మరింత ఆలస్యంగా నాట్లు వేశారు. ప్రస్తుతం వరి పంట పొట్ట, ఈనిక దశలో ఉన్నాయి. ఈ సమయంలో నీరు అందక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఉభయగోదావరి జిల్లాల్లో రబీలో వరి సాగుకు 93 టీఎంసీల నీరు అవసరం. రోజూ 9 వేల క్యూసెక్కుల నీరు తూర్పు, మధ్య, పశ్చిమ కాల్వలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 7 వేల 500 క్యూసెక్కులు అందుబాటులో ఉంటోంది. గోదావరిలో సహజ జలాలు పూర్తిగా పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో సీలేరు నీరే సాగుకు ప్రధాన వనరు. సీలేరు నుంచి వస్తున్న నీరూ పంట అవసరాలకు చాలని పరిస్థితి ఉంది. - రామకృష్ణ, ఎస్ఈ ధవళేశ్వరం సర్కిల్
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈ నెల 31న కాల్వకు నీటి విడుదల ఆపేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వరి సాగు పూర్తవ్వాలంటే ఏప్రిల్ నెల చివరి వరకు నీరు అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో సరిపడా నీరు అందించి పంటలు కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి