కరోనా ప్రభావం వల్ల గత విద్యా సంవత్సరం ముగియకుండా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. నూతన విద్యా సంవత్సరం ఆరంభం సైతం వాయిదా పడింది. అయిదో విడత లాక్‌డౌన్ అమలవుతున్న వేళ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం సునందనపేటలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలను మంగళవారం తెరిచారు. పలువురు విద్యార్థులు పాఠశాలకు వెళ్లారు. కరోనా ఉద్ధృతి ఉన్నా పాఠశాలను తెరవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై అనపర్తి మండల విద్యాశాఖాధికారిణి విజయకుమారిని ఈనాడు వివరణ కోరగా జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు మంగళవారం, 6, 7 తరగతులు బుధవారం, 8, 9, 10 తరగతులకు శుక్రవారం ఉపాధ్యాయులు హాజరవ్వాలని, దూరదర్శన్ ద్వారా ప్రసారమవుతున్న బ్రిడ్జి కోర్సు, 6 నుంచి 10 తరగతుల పాఠ్యాంశాలల్లోని విద్యార్థులకు సందేహాలు ఉంటే వారానికి ఒక్క రోజు పాఠశాలల్లోనే నివృత్తి చేయాలని పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో బ్రిడ్జి కోర్సు మూల్యాంకన తరగతులను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తెలిపింది.
ఇదీ చదవండి: భారత్, చైనాలు సంయమనం పాటించాలి: ఐరాస