దేవిన శ్రీనివాస్ పుట్టింది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామం. వ్యవసాయ కుటుంబమైన మాణిక్యం, సుబ్బారావు దంపతులకు 1976లో జన్మించిన శ్రీనివాస్ చిన్ననాటి నుంచి చదువుతోపాటు చిత్రకళపై ఆసక్తి కనపరిచేవారు. బడిలో చదివే రోజుల్లో కరణం నూకరాజు అనే డ్రాయింగ్ టీచర్ ప్రోత్సాహంతో చిత్రకళపై ప్రత్యేక దృష్టి పెట్టి నేర్చుకున్నారు. పెద్దాపురం మహారాణి కళాశాలలో చేరి మరో రెండేళ్లు ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు. అదే సమయంలో చిత్రకళలో ఎన్నో బహుమతులు అందుకున్నారు.
డిగ్రీ చదువుతున్న సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చిత్రకళను పక్కన పెట్టి పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక వ్యవసాయం చేస్తూనే పెళ్లి మండపాల డెకరేషన్, పూల అలంకరణ వృత్తిగా ఎంచుకున్నారు. మరోవైపు నాటక సమాజంలో చేరి నటుడిగా పెద్దల ప్రశంసలు అందుకున్నారు. గణపతి నవరాత్రుల్లో స్నేహితులతో కలిసి రంభతో గణపతి విగ్రహాన్ని తయారు చేసి డ్రై ఫ్రూట్స్‌తో అందంగా అలంకరించారు. అప్పటినుంచి వస్తువులతో రూపాలు తయారు చేయడం ప్రారంభించారు.
కొంతకాలం పెన్సిల్, సబ్బులు, చాక్ పీస్‌లపై బొమ్మలు గీశారు. ప్రముఖ సైకతశిల్పి పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పాలు ఛాయాచిత్రాలను ఈనాడు పత్రికల్లో చూసి స్ఫూర్తి పొంది సందేశాత్మక శిల్పాల ఆవిష్కరణకు పూనుకున్నారు. దానికోసం ఎంతో సాధన చేశారు. ఇప్పుడు తన చేతిలో ఇసుక తిన్నెలు కొత్త సోయగాలతో కనువిందు చేస్తున్నాయి. సందర్భాన్ని బట్టి సందేశాత్మక శిల్పాలు ఆయన చేతిలో రూపుదాల్చుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బెస్ట్ ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్న ఏకైక వ్యక్తి దేవుని శ్రీనివాస్.