RESTRICTIONS TO CBN TOUR IN GODAVARI : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మూడో రోజు పర్యటనలో పోలీసు ఆంక్షలు విధించడం వల్ల అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. అనపర్తి దేవీ చౌక్ సెంటర్లో చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులు.. ఇవాళ అనుమతి లేదంటూ సాకులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ప్రైవేటు స్థలం తీసుకుని కార్యక్రమం పెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం ముందుగా నిర్ణయించుకున్న దేవీ చౌక్ సెంటర్లోనే చంద్రబాబు రోడ్ షో ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటే ఊరుకునేది లేదని నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో చంద్రబాబు 2 రోజుల సభలలో ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఓర్వలేకే ఇవాళ అనుమతి లేదంటున్నారని నల్లమిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనపర్తిలో దేవీచౌక్ సెంటర్ వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు ఎవరూ దేవీచౌక్కు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. బారికేడ్లు తోసుకుని దేవీచౌక్ సెంటర్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. దీంతో తోపులాట జరిగింది.
మరోవైపు చంద్రబాబు అనపర్తి రాకుండా బలభద్రాపురంలో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా లారీలు, పోలీసు వాహనాలు నిలిపి అడ్డుకున్నారు. చంద్రబాబు వాహనశ్రేణికి అడ్డంగా కానిస్టేబుళ్లను అధికారులు కూర్చోబెట్టారు. ఈ విషయం తెలుసుకుని అనపర్తి నుంచి టీడీపీ శ్రేణులు బలభద్రపురం బయలుదేరారు.
రౌడీ రాజ్యాన్ని అంతమొందించేందుకు ఇక్కడ నుంచే కౌంట్ డౌన్ ప్రారంభం.. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నాం.. సైకో చెప్పాడని ఇచ్చిన అనుమతి రద్దు చేస్తారా? -చంద్రబాబు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఎక్కడికి వెళ్లినా గంజాయి సరఫరా, బ్లేడ్ బ్యాచ్‌ల ఆగడాల పైనే చెపుతున్నారని ధ్వజమెత్తారు. డీజీపీ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు గంజాయి నివారణపై కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని కోరారు. గంజాయితో మన బిడ్డల భవిష్యత్తు నాశనం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. విద్యార్థులతో ముచ్చట్లు ఎప్పుడూ ఆసక్తికరమే, ఆహ్లాదకరమేనన్నారు. పెద్దాపురం పర్యటనలో వారితో కొద్దిసేపు గడిపే అవకాశం దక్కిందన్నారు. వీళ్లందరికీ ఎన్నో లక్ష్యాలు ఉంటాయని.. ఆ లక్ష్యాలను చేరుకునేలా వారికి అవకాశాలు కల్పించడం పాలకుల విధి అన్నారు. విద్యార్థులకు సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు.
ఇవీ చదవండి: