అన్యాయాన్ని ప్రశ్నించినందుకు పోలీసులు తీసుకెళ్లి కొట్టారని, తన చావుకు కోటనందూరు ఎస్సై సహా పలువురు నాయకులు కారణమని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. దాంతోపాటు.. జిల్లా కలెక్టర్ పేరిట ఓ లేఖ రాసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అనంతరం ఎవరికీ కనపడకుండా అదృశ్యమైపోయారు. ఈ ఘటన జిల్లాలో శనివారం సంచలనం సృష్టించింది. రౌతులపూడి మండలం ములగపూడి గ్రామానికి చెందిన జి.అప్పలనాయుడు తన సొంత స్థలంలో సెల్‌టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఈ పనులు నిలిపివేయాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చినా దౌర్జన్యంగా పనులు ప్రారంభించారని.. ప్రశ్నిస్తే కోటనందూరు పోలీసులు తనను తీసుకెళ్లి కొట్టారని అప్పలనాయుడు లేఖలో పేర్కొన్నారు. వైకాపాకు చెందిన గ్రామస్థాయి నాయకులు సతీష్‌కుమార్, సత్యనారాయణ తదితరుల అండదండలతో పోలీసులు తనను వేధిస్తున్నారని, మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖలో రాశాడు. కోటనందూరు ఎస్సై అశోక్ ఈ విషయంపై మాట్లాడుతూ ఉదయం నుంచి అతడి కోసం రౌతులపూడి పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నామని చెప్పారు. ములగపూడికి చెందిన ఓ వ్యక్తి సెల్‌ఫోనుకు అప్పలనాయుడి నుంచి సందేశాలు వస్తుండటంతో ఆ దిశగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైకాపా నాయకులు సతీష్‌కుమార్, సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి :