PEOPLE PROBLEMS OVER CM TOUR : సీఎం తమ నగరానికో, పట్టణానికో వస్తున్నారంటే.. సమస్యలు పరిష్కారం అవుతాయని, రహదారులు, పరిసరాల దశ మారుతుందని సహజంగా స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తుంటారు. అయితే అందుకు విరుద్ధంగా సీఎం జగన్ పర్యటన అంటే మాత్రం ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వందల సంఖ్యలో పోలీసులు, అడుగడుగునా బారికేడ్లు, అనేక ఆంక్షలతో అవస్థలకు గురి చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రాకతో ఈసారి ఆ సమస్యలన్నీ రాజమహేంద్రవరం వాసుల్ని పలకరించాయి. జగన్ పర్యటన వేళ పోలీసుల ఆంక్షలు స్థానికులకు చుక్కలు చూపించాయి.
రాజమహేంద్రవరంలో సీఎం సభా మార్గాన్ని అష్ట దిగ్బంధనం చేసిన పోలీసులు.. అప్సర థియేటర్ వద్ద ఎక్కడికక్కడ తాళ్లు కట్టారు. స్థానికులు ఇళ్లకు వెళ్లాలన్నా బతిమలాడినా, రోగులు ఆస్పత్రికి వెళ్లాలని వేడుకున్నా కనికరించలేదు. జగనన్న వస్తుంటే.. ఒక్కరోజు సహకరించలేరా అంటూ పోలీసులు, వైకాపా నేతలు జనంపై రుసరుసలాడారు. నెత్తీనోరు బాదుకున్నా అనుమతించకపోవడంతో.. మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీఎం పర్యటన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 1,564 విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని సభకు తరలించారు. జగన్ రాకతో అనేక దుకాణాలను పోలీసులు మూసేయించారు. బారికేడ్లతో ప్రజల రాకపోకలను అడ్డుకోవడంతో ప్రతిరోజూ కొనుగోలుదారులతో కళకళలాడే వ్యాపార సముదాయాలు వెలవెలబోయాయి. దాంతో నగరంలోని పలు ప్రాంతాల్లో అనధికారిక కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. బహిరంగ సభకు వైసీపీ నేతలు, వాలంటీర్ల సహకారంతో జనసమీకరణ చేసినా.. సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే.. చాలా మంది ఇంటిముఖం పట్టారు.
ఇవీ చదవండి: