CI and SI Suspension: తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం సీఐ, సామర్లకోట ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ విజయ్, ఎస్‌ఐ అభిమన్యును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఎస్సీ యువకుడు గిరీశ్ బాబు ఆత్మహత్య వ్యవహారంలో.. సీఐ, ఎస్‌ఐ పేర్లు తెరపైకి వచ్చాయి. ఎస్సై కొట్టడం వల్లే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. మృతుని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీఐ, ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు.
పోలీసుల చిత్రహింసలతోనే ఆత్మహత్య
గిరీష్ మరణానికి మహిళా వాలంటీరు, ఆమె భర్త అన్యాయంగా కేసు పెట్టడమే కారణమని.. ఎస్‌ఐ, కుర్రాడిని పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
అసలేం జరిగింది..
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని బలుసులపేటకు చెందిన దళిత యువకుడు ఆలపు గిరీష్‌బాబు (24) బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైకాపాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశానన్న కక్షతో, తప్పుడు కేసు పెట్టించి, పోలీసులతో కొట్టించి తన తమ్ముడి చావుకు కారణమయ్యారంటూ మృతుడి సోదరుడు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కుటుంబీకులు ఉదయం 10.30 గంటలకు సామర్లకోట పోలీసు స్టేషన్ మెట్ల దగ్గర మృతదేహం ఉంచి ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
వాలంటీరు భర్తే చొక్కా పట్టుకున్నారు...
ఈ నెల 1న సచివాలయం నుంచి సంక్షేమ కార్యదర్శి ఫోన్ చేస్తే నేను, గిరీష్ కలిసి బలుసులపేట వెళ్లాం. అక్కడ మాట్లాడుతుండగా పక్కనే ఉన్న వార్డు వాలంటీరు, ఆమె భర్తతో సీఎఫ్‌ఎంఎస్ ఐడీ అంశంపై మాట్లాడుతున్నారు. సీఎఫ్‌ఎంఎస్ ఐడీ ఆలస్యమవుతుందని వ్యాఖ్యానించడంతో నువ్వెవరు మాకు చెప్పడానికి అంటూ మాతో వాగ్వాదానికి దిగారు. గిరీష్ అడ్డుకోగా వాలంటీరు భర్త తన చొక్కా పట్టుకున్నారు. తరువాత గొడవ సద్దుమణిగింది. ఆ సంఘటనకు, నమోదు చేసిన కేసులకు సంబంధం లేదు. సామర్లకోట నాయకులు, కౌన్సిలర్ కలిసి ఎస్సైతో ఇలా చేయించారు. మాకు న్యాయం చెయ్యాలి.
- భానుప్రసాద్, గిరీష్ మిత్రుడు
సంబంధిత కథనం:
YOUNG MAN SUICIDE : పోలీసులు కొట్టారని దళిత యువకుడి ఆత్మహత్య..!