తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారికి మద్దతుగా నిలిచేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. శనివారం ఆయన దివిస్ పరిశ్రమ ప్రాంతం కొత్తపాకలలో ఆయన పర్యటించనున్నారు. దీనికి పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సభకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు.
సెక్షన్144 అమల్లో ఉన్నందున పవన్‌కు అనుమతి నిరాకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ పేర్కొన్నారు. దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా రేపు తలపెట్టిన పవన్ పర్యటనకు అన్ని అనుమతులు తీసుకున్నట్లు ఈ ఉదయం ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దుర్గేశ్ తెలిపారు. అయితే పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కావాలనే అనుమతి రద్దు చేయించినట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు. ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని యథావిథిగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ బహిరంగ సభకు అనుమతులు లేవని చివరి నిమిషంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ప్రకటించడం అప్రజాస్వామికం. పోలీసు వ్యవస్థకే తలవంపులు. శాంతియుతంగా దివీస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడానికి వెళ్తున్న పవన్ కల్యాణ్ కార్యక్రమానికి పోలీసుల ద్వారా అవరోధాలు సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నాం. ఏదీఏమైనప్పటికీ కార్యక్రమాన్ని యథావిధిగా 9న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. పోలీసులను అడ్డుపెట్టుకొని జనసేన కార్యక్రమాలని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది - నాదెండ్ల మనోహర్, ఛైర్మన్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ
ఇదీ చదవండి