తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడి పంచాయతీకి రెండు వర్గాల మధ్య వేలం నిర్వహించగా ఒక వర్గం రూ.51 లక్షల వరకు పాటకు వెళ్లగా మరో వర్గం రూ.52 లక్షల వరకు వెళ్లింది. అధికార పార్టీ నాయకుడు అడ్డుతిరగడంతో వ్యవహారానికి బ్రేక్ పడింది. తొలిరోజు వైకాపా రెబల్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయగా.. పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి సైతం శనివారం నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. వేలం పాడిన వ్యక్తి నామినేషన్ వేసే రోజే డబ్బు కట్టకపోతే తెదేపా నాయకులు కూడా ఇక్కడ నామినేషన్ వేయడానికి సిద్ధం అవుతున్నారు.
లెక్క కుదరలేదండి: జగ్గంపేట మండలంలోని గుర్రంపాలెం పంచాయతీలో అధికారపార్టీ వ్యక్తికి సర్పంచి పదవిని అప్పగిస్తే వచ్చే ప్రోత్సాహక నిధులు.. ఉపాధి మ్యాచింగ్ గ్రాంటు కింద కడితే రూ.కోటి మంజూరు అవుతాయని.. ఆ నిధులతో మరో వర్గం అభివృద్ధి పనులు చేపట్టేలా చర్చలు జరిపారు. సకాలంలో బిల్లులు వచ్చేలా అధికార పార్టీ నాయకులు బాధ్యత తీసుకోవడానికి అంగీకార పత్రం ఇస్తామన్నట్లు సమాచారం. తెదేపా వర్గం అంగీకరించకపోవడంతో ఎన్నిక అనివార్యం కానుంది.
ఒకే మాట..కాదు కాదు..
ఏకగ్రీవ పంచాయతీల దిశగా అధికార పక్ష నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే.. విపక్షాలకు ఈ దిశగా అనుకూల పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు. అందుకే కొన్నిచోట్ల వేలంపాటలు కొలిక్కి వస్తున్నా కొందరు అడ్డుతిరుగుతుండడంతో బెడిసికొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన స్పష్టత రావాలన్నా నామినేషన్ల గడువు వరకు నిరీక్షించాల్సిందే.
గండేపల్లి మండలంలోని మురారి పంచాయతీలో సర్పంచి పదవి రూ.15 లక్షలకు ఏకగ్రీవమైనట్లు సమాచారం. ఈ సొమ్ము గ్రామాభివృద్ధికి ఖర్చుపెట్టడానికి అధికార పక్షం మద్దతుదారు అంగీకరించడంతో అందరూ సరే అన్నట్లు భోగట్టా.
ఒక్కోచోట ఒక్కోలా..
కాకినాడ గ్రామీణం పి.వెంకటాపురం పంచాయతీ ఏకగ్రీవమయ్యే వీలుంది. మిగిలినచోట్ల అధికార పక్షం నుంచే ఒక్కో పంచాయతీ నుంచి రెండు, మూడు వర్గాలు అవకాశం ఇవ్వాలని అమాత్యుడిని కలుస్తున్నారు. అందరినీ ఒకేతాటిపైకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో ఆశావహులు ఎక్కువగా కనిపిస్తున్నా.. పోటీలో ఒక్కరే నిలిచేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రూపు రాజకీయాలు వద్దని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార పక్షానికి గట్టిగా బదులిచ్చే క్రమంలో ప్రతిపక్షాలు అంతర్గత ఏకాభిప్రాయానికి వస్తున్నాయి.
ముమ్మిడివరం మండలం కొత్తలంక పంచాయతీలో తెదేపా పోటీలో ఉండకుండా జనసేన అభ్యర్థికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాళ్లరేవు మండలంలోని పి.మల్లవరంలో తెదేపా అభ్యర్థికి జనసేన మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. సుంకరపాలెం, జి.వేమవరం, జార్జిపేట, పటవలలో పొత్తుల దిశగా చర్చలు సాగుతున్నాయి.
గత ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా కొన్నిచోట్ల, జనసేన కొన్నిచోట్ల నామినేషన్లు వేయలేదు. అప్పట్లో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈదఫా ఆ పరిస్థితి ఉంటుందా..? వేర్వేరుగా బరిలో ఉంటారా..? అనే దానిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో అధికార పార్టీ నుంచి పోటీ ఉంది. ప్రతి స్థానం నుంచి ఒకరినే బరిలోకి దింపేలా చూస్తున్నారు.
పెద్దాపురం మండలంలోని పంచాయతీల్లో పోటీకే మొగ్గుచూపుతున్నారు. వైకాపా, తెదేపా, జనసేన మద్దతుతో పలువురు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి: మద్యం సేవించి విధులు.. చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు