కరోనా వ్యాప్తితో విద్యా సంస్థల విద్యా విధానాల్లో మార్పులు వస్తున్నాయి. పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయే అర్థం కాని పరిస్థితుల్లో చాలా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సాంకేతికతను ఉపయోగించి విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు బోధిస్తున్నాయి. వీటికోసం రోజుకు సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు చిన్నారులు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లకు అతుక్కుపోతున్నారు.
ఈ క్రమంలో విద్యార్థుల చదువుల మాటెలా ఉన్నా గంటల తరబడి ఇయర్ ఫోన్, హెడ్‌ఫోన్లు పెట్టుకుని ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లను చూడడం వల్ల చిన్నారుల్లో దృష్టి, వినికిడి సమస్యలతోపాటు మెడ కండరాల ఇబ్బందులూ ఎదురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నపాటి సూచనలు పాటిస్తే వాటిని దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఆన్‌లైన్ తరగతుల వల్ల రాజమహేంద్రవరం నగరంలో హెడ్‌ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఎదురయ్యే సమస్యలివీ..
- చిన్నారుల కంటిలో ఎకామిడేషన్ అనే ప్రక్రియకు ఇబ్బంది ఏర్పడవచ్ఛు దాంతో తలపోటు, కళ్లు పొడిబారిపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్ఛు.
- చిన్నారులు దగ్గర్నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను చూడడం వల్ల ఒక్కోసారి దూరంగా చూసినప్పుడు 30 సెకన్లపాటు వారికి ఏమీ కనిపించకపోవచ్ఛు.
- కనురెప్పలు మూసే సంఖ్య తగ్గిపోతుంటుంది. దానివల్ల కార్నియా పొడిబారిపోయి ఆరిపోతుంది.
- ఇయర్‌ఫోన్లు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల నరాలు ఎక్కువసేపు వైబ్రేట్ అయ్యి చెవిపోటు, వినికిడి సమస్య రావచ్ఛు.
- మెడ కండరాలకు సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది.
ఎకామిడేటివ్ కసరత్తులతో మేలు
ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు పావు గంటకోసారి విరామం తీసుకుని ఎకామిడేటివ్ కసరత్తులు చేయాలి. అంటే విరామం సమయంలో ఆరు మీటర్ల దూరంలో ఉన్న వస్తువును ఒక నిమిషం లేదా 30 సెకన్లపాటు చూడాలి. దీంతో కంటిలో కండరం ఉపశమనం పొందుతుంది. రెప్పలు ఎక్కువ సార్లు ఆడిస్తూ ఉండాలి. సమస్య ఎదురైతే గోరువెచ్చటి నీటిలో కాటన్ వస్త్రాన్ని ముంచి కంటికి కాపడం పెడితే కంటిలో తేమశాతం పెరుగుతుంది. ప్లూయిడ్స్, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి.
- డాక్టర్ వి.అశోక్‌కుమార్, కంటి వైద్యనిపుణుడు, రాజమహేంద్రవరం
విరామంతో వినికిడి సమస్యకు దూరం
ఎక్కువ సేపు హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు పెట్టుకుని వినాల్సి వచ్చినప్పుడు అరగంటకోసారి విరామం తీసుకుంటే మంచిది. వీలైనంత వరకు హెడ్‌ఫోన్లను వదిలేసి స్పీకర్ ఆన్ చేసుకుని మామూలుగా పాఠాలు వినాలి. ఎక్కువ సౌండు పెట్టుకుని వినకుండా సాధారణంగా వినే వాల్యూమ్ పెట్టుకోవాలి.
- డాక్టర్ సునిల్‌రాజ్, ఈఎన్‌టీ వైద్య నిపుణుడు, రాజమహేంద్రవరం
తల్లిదండ్రులు పర్యవేక్షించాలి..
ఆన్‌లైన్ తరగతులకోసం అంతర్జాల సేవలతో ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లను విద్యార్థులకు ఇస్తున్నారు. వారిని తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్లకు ఎడిక్ట్ కాకుండా చూసుకోవాలి. ఒంటరిగా విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలకు హాజరవడం వల్ల వారిలో సృజనాత్మకత లోపించే ప్రమాదం ఉంది. వారిలో సృజనాత్మకత పెంపునకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మెడ కండరాలకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి 30 నిమిషాలకు విరామం తీసుకోవాలి. కొన్ని చిన్నచిన్న కసరత్తులు చేయాలి.
- డాక్టర్ చంద్రశేఖర్, ఫిజీషియన్, రాజమహేంద్రవరం
-
ఇదీ చదవండి: