New Twists in Four Andhra Pradesh People Suicide Case in Varanasi: వడ్డీ వ్యాపారులతో విసిగిపోయి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు డిసెంబర్ 6వ తేదీన వారణాసిలోని ఓ కాటేజ్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఆ కుటుంబం ఉన్న గదిలో లభించిన సూసైడ్ నోట్లో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండున్నర పేజీల సూసైడ్ నోట్ లో వైసీపీ, చంద్రబాబు నాయుడు పేర్లు సైతం ఉన్నాయి.
Family Suicide in Varanasi: ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన కొండాబాబు (50), ఆయన భార్య లావణ్య (45), కుమారులు రాజేష్ (25), జయరాజ్ (22)లు డిసెంబర్ 6వ తేదీ బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం అర్థరాత్రి వారణాసిలో వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అందరూ బస చేసిన కాటేజ్ ట్రస్ట్ ద్వారా ఆ నలుగురి అంత్యక్రియలు జరిగాయి.
వారణాసిలో సంచలనం - ఒకే గదిలో ఉరి వేసుకున్న ఏపీకి చెందిన నలుగురు
ఆ ముగ్గురి వల్లే ఆత్మహత్య: సూసైడ్ నోట్ రాజేష్ రాసినట్లు ఉంది. తన పేరు రాజేష్ అని, నాన్న కొండబాబు, తల్లి లావణ్య, తమ్ముడు జయరాజ్ అని తెలిపారు. తాను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా నివాసిని. మండపేటలోని 'దుర్గా దివ్వెట్ ఆటో కన్సల్టెన్సీ' షాపులో పని చేస్తున్నానని అన్నారు. షాపు యజమాని పెంటగట్ల ప్రసాద్ (యూనియన్ ప్రెసిడెంట్) నుంచి తన వ్యక్తిగత అవసరాల కోసం 6 లక్షల రూపాయల తీసుకున్నట్లు పేర్కొన్నారు. షాపులో పనిచేసిన రామిరెడ్డి వీరలక్ష్మి, రాజకీయ పలుకుబడి ఉన్న మల్లిబాబు తనపై కుట్ర పన్నారని రాశారు. తనతో కుటుంబ సభ్యులందరితోనూ సంతకాలు చేపించుకున్నారని ఆ నోట్లో తెలిపారు. ఒక్కక్కరి నుంచి 10 తెల్ల కాగితాలు, 10 బాండ్ పేపర్లపై సంతకాలు చేపించుకున్నారని రాశారు. అదే విధంగా 20 చెక్కులపై సైతం సంతకాలు పెట్టించుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో అప్పు తీర్చేందుకు తమ నగలు, ఇంటి సామాన్లు విక్రయించి 5 లక్షల రూపాయలను షాపు యజమానికి తిరిగి చెల్లించామని, తర్వాత లక్ష ఇస్తానని చెప్పినట్లు నోట్లో తెలిపారు. చెక్కు, కాగితాలు అడిగితే మల్లిబాబుతో బెదిరించినట్లు ఆ నోట్లో రాశారు. 10 రోజుల్లో 6 లక్షలు ఇవ్వాలని లేకపోతే సంతకాలు పెట్టిన పేపర్లు ఉన్నాయని వాటిపై 20 లక్షలు అప్పు తీసుకున్నట్లు రాస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.
చంద్రబాబే జైలులో ఉన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఏం చేస్తారు: అయితే సహాయం కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తే, ప్రస్తుతం మా వైసీపీ అధికారంలో ఉంది అని అన్నారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లినా సరే సీఐకి పదివేలు ఇస్తే కేసు మీ మీదే పెడతారని పేర్కొన్నారు. అలా కాకుండా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లినా ఏం చేయలేరని, ఆ పార్టీ అధినేత చంద్రబాబే జైలులో ఉన్నారు. ఇంక ఆ పార్టీ ఎమ్మెల్యే ఏం చేస్తారు అని బెదిరించినట్లు సూసైడ్ నోట్లో తెలిపారు. ఊరు వదిలి వెళ్లిపోయినా సరే రాష్ట్రం మొత్తం మావాళ్లే ఉన్నారని, పట్టుకుని మరీ చంపేస్తారని అన్నట్లు రాశారు.
మాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదు: ఈ ముగ్గురి బెదిరింపుల కారణంగా తాము రాష్ట్రం వదిలి వెల్లిపోయామని అన్నారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో రెండు నెలలుగా కోల్‌కతా, తమిళనాడు, హరిద్వార్, వారణాసిలో గడిపనట్లు తెలిపారు. రెండు రోజులకు ఒకసారి కడుపు నింపుకున్నామన్నారు. సూసైడ్ చేసుకున్న రోజుతో తమ వద్ద డబ్బులు అయిపోయాయని ఇక్కడ నుంచి వెళ్లడానికి, తినడానికి ఏమీ లేదని సూసైడ్ నోట్లో తెలిపారు. తమ మరణాలను కారణం పెంటగట్ల ప్రసాద్, రామిరెడ్డి వీరలక్ష్మి, మల్లిబాబు అని రాశారు. తమకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సూసైడ్ నోట్‌నే తమ మరణ వాగ్మూలంగా భావించాలని తెలిపారు.