కరోనాతో మృతి చెందిన కృష్ణా జిల్లా చిలకల్లు ఎస్సై అల్లు దుర్గారావు కుటుంబానికి తెదేపా తరఫున అండగా ఉంటానని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. ఎస్సై ఇద్దరు కుమార్తెలను తాను చదివిస్తానని హామీ ఇచ్చారు. ఎస్సై కుటుంబాన్ని ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చేపూరు గ్రామంలో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్సై కుమార్తెతో నారా లోకేశ్ ఫోన్లో మాట్లాడారు.
మా నాన్న కుర్చీలో నేను కూర్చోవాలి... ఆయన చేయాలనుకున్న మంచి పనులు నేను చేయాలి సార్.. మా నాన్న చివరి క్షణాల్లోనూ మాకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం సాయం అందిస్తే మా కుటుంబ బాధ్యతను నా భుజాలపై వేసుకుంటా సార్ అని నారా లోకేశ్‌తో ఎస్సై కుమార్తె చెప్పిన మాటలు అందర్నీ కంటతడి పెట్టించింది. ఎస్సై కుమార్తెలిద్దరికీ తాను అన్నలా అండగా ఉంటానని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
అనంతరం తెదేపా నేత పట్టాభి మీడియాతో మాట్లాడారు. ఉన్నతాధికారుల వేధింపులతో దుర్గారావు మానసిక వేదన అనుభవించారని.... దీనికితోడు కరోనా సోకినా సరైన వైద్యం అందకపోవటంతో దుర్గారావు మృతి చెందాడని పట్టాభి అన్నారు. దుర్గారావు మృతి ప్రభుత్వ హత్యగా భావిస్తున్నామని... దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.