తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగరపంచాయతీ కాలపరిమితి వచ్చే నెల మూడో తారీఖుతో ముగియనుంది. దీనికి తోడు నూతన ప్రభుత్వం గ్రామ పంచాయతీలు ,జిల్లా పరిషత్తులు నగర పంచాయతీలోనూ ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.
ముమ్మిడివరం నగరపంచాయతీ కు సంబంధించి మొత్తం ఇరవై వార్డుల ఓటర్ల జాబితా సిద్ధం చేసి... కులాల గణన పూర్తి చేశారు. అందుకు అవసరమైన పోలింగ్ కేంద్రాలనూ సిద్ధం చేశారు.
2014లో జరిగిన నగరపంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం 12వార్డుల్లో గెలిచి ఛైర్‌పర్సన్ పదవి దక్కించుకున్నారు. వారి హయాంలో నూతనంగా సువిశాలంగా, అన్ని హంగులతో కూడిన కార్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం నియోజవర్గంలో వైసీపీ అధికారంలో ఉండటంతో ఈసారి ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి నుంచే తెదేపా, వైకాపా నాయకులు, కార్యకర్తలు సమావేశాలు , ప్రచారాలు నిర్వహిస్తున్నారు.