‘నాడు- నేడు’ ద్వారా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, ప్రహరీలు, పంకాలు తదితర అంశాలను చక్కదిద్దాలనేది సంకల్పం. తూర్పుగోదావరి జిల్లాలోని 1,372 పాఠశాలల్లో పనులు చేపట్టగా.. నాబార్డు నిర్వహణలో 41 (గుత్తేదారులు చేస్తున్నారు), తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో 1,331 చోట్ల పనులు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల కమిటీ ద్వారా రూ.190 కోట్ల పనులు చేపట్టారు. ఇందులో ఇప్పటికి రూ.130 కోట్లు ఖర్చు చేయగా.. రూ.30 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. మొత్తంగా తొమ్మిది పనులను చేపట్టారు. పదో అంశంగా వంట గదుల నిర్మాణాన్ని ప్రతిపాదించి.. తొలివిడత 400 వరకు వంట షెడ్ల నిర్మాణాన్ని తలపెట్టారు. ఈ పనులను ఉపాధి హామీ కింద చేపట్టాల్సి ఉన్నా మొదలవలేదు.
*తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం మండలం వెంకటాపురం, నల్లమిల్లి ప్రాథమిక పాఠశాలల్లోనూ మరుగుదొడ్ల పనులు అసంపూర్తిగా ఉండగా.. ప్లంబింగ్ పనులు చేయించడానికి నిధులు లేవు.
*గండేపల్లి మండలంలో ఎల్లమిల్లి, నాగంపల్లి పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం 90 శాతం పూర్తి చేశారు. వీటికి టైల్స్ వేసి, శానిటరీ సామగ్రి బిగించాలి. ఇండెంట్ పెట్టినా నేటికీ రాక పనులు నిలిచాయి.
*జిల్లాలో 494 పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణానికి రూ.777.30 లక్షలు మంజూరు చేశారు. 142 పాఠశాలల్లో పనులు పూర్తవగా 201 చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన చోట్ల పనులు మొదలవలేదు.
*●పామర్రు ఉన్నత పాఠశాలలో ప్రహరీ నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైనా నేటికీ పనులు మొదలవలేదు.
*కె.గంగవరం మండలంలో మొదటి విడత ‘నాడు-నేడు’లో 22 పాఠశాలలను అభివృద్ధి చేయాలని ఎంపిక చేశారు. 164 పనులను రూ.365.77లక్షలతో ప్రతిపాదించారు. పాఠశాలలు తెరిచే సమయం ఆసన్నమైనా నేటికి ఒక్క చోట కూడా పనులు పూర్తి కాలేదు. రెండు నెలల కిందట మండల కార్యాలయం నుంచి పంపిన సిమెంటు ఆర్డరు నేటికీ రాలేదు. స్థానికంగా కొన్ని పనులు చేద్దామన్నా నిధులు విడుదల కావడం లేదు. ఇప్పటికే ఖర్చు చేసిన నిధుల్లో ఇంకా మండలానికి రూ.57 లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. కొందరు ప్రధానోపాధ్యాయులు ఒత్తిడి తట్టుకోలేక అప్పులు తెచ్చి బాకీ తీరుస్తున్నారు. నిధులు, సిమెంటు కొరతతో పామర్రు ప్రాథమిక పాఠశాలలో పనులు అసంపూర్తిగా మిగిలాయి.
●*పెదపూడి ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి కాలేదు. తరగతి గదుల్లో పనులు కొలిక్కి రాలేదు. పనుల కోసం తెచ్చిన సామగ్రి పాఠశాల ముందు అలాగే పడి ఉంది. నిధులు రాకపోవడంతో ఇప్పటికే కూలీలకు వేతనాలు చెల్లించలేకపోయామనీ, పనులు కూడా అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చిందని సంబంధిత బాధ్యులు చెబుతున్నారు.
నిధి రాక.. విధి లేక..
సింహభాగం పనులు తల్లిదండ్రుల కమిటీల ద్వారా చేపట్టారు. ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో, సంఘం పర్యవేక్షణలో పనులు మొదలయ్యాయి. తొలినాళ్లలో జూన్ ఆఖరునాటికే పూర్తి చేయాలని తొందరపెట్టారు. తొలుత ఇసుక, సిమెంటు కొరతతో పనుల్లో జాప్యం జరిగింది. తర్వాత అవి వచ్చేసరికి వర్షాలు ఆటంకం కలిగించాయి. వాటిని అధిగమించే సరికి నిధుల కొరత అడ్డంకిగా మారింది. చేసిన పనుల బిల్లులను ‘మనబడి నాడు నేడు’ యాప్‌లో ప్రధానోపాధ్యాయులు అప్‌లోడ్ చేశాక రివాల్వింగ్ ఫండ్ బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. ఇప్పుడు బిల్లులు అప్‌లోడ్ చేయడమే తప్ఫ.. నిధులు రాక అప్పులు చేయాల్సి వస్తోందని పలువురు ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు.
సామగ్రి రానేలేదు...
తరగతి గదుల్లో ఫర్నిచర్, మరుగుదొడ్లకు శానిటరీ సామగ్రి, గ్రీన్‌చాక్ బోర్డులు, పాఠశాల భవనాలకు రంగులు అవసరం. ఇవి ఇంత వరకు పాఠశాలలకు అందలేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రం రంగులు వేయడం ఐదారు రోజుల కిందటే మొదలు పెట్టారు. శానిటరీ సామగ్రి రాక మరుగుదొడ్లు పనులు మొదలే కాలేదు.
ప్రభుత్వానికి నివేదించాం
ఇప్పటి వరకు చేసిన పనులకు రూ.30 కోట్లు నిధులు రావాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వానికి నివేదించాం. కొద్ది రోజుల్లోనే నిధులు విడుదలయ్యే వీలుంది. పనుల ప్రగతిలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నాం. నాణ్యత విషయంలో రాజీపడటం లేదు. కలెక్టరు, జేసీ, డీఈవో ఎప్పటికప్పుడు పనుల ప్రగతిపై ఆరా తీస్తున్నారు. - బి.విజయభాస్కర్, సమగ్ర శిక్ష, ఏపీసీ
ఇదీ చదవండి:'విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు'