అన్నవరం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్ ద్వారా నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ...కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కాకినాడ ఎంపీ వంగా గీత లేఖ రాశారు. ప్రసాద్ పథకం కింద అన్నవరం దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ. 48.58 కోట్లతో రాష్ట్ర పర్యాటక శాఖ ప్రతిపాదనలు చేసి కేంద్ర పర్యాటక శాఖకు డీపీఆర్ నివేదికను 2018 జనవరిలోనే పంపించారు. అయితే అప్పటి నుంచి ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.
కరోనా ప్రభావంతో అన్నవరం దేవస్థానం ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపడంతో అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడే పరిస్థితులు వచ్చాయి. నిధులు లేని కారణంగా అనేక పనులు ఇప్పట్లో పూర్తి చేసే పరిస్థితి లేదని దేవస్థానం వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్ పైనే అధికారులు ఆశలు పెట్టుకున్నారు. శ్రీశైలం దేవస్థానంలో ఈ పథకం ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా నిధులు మంజూరైతే పలు అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఈ అంశంపై ఈటీవీ భారత్- ఈనాడులో కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి ఎంపీ దృష్టికి మరోసారి తీసుకువెళ్లారు.
దీంతో కేంద్ర మంత్రికి కాకినాడ ఎంపీ వంగా గీతా ఈ విషయమై మరోసారి లేఖ రాశారు. దేశంలోనే అన్నవరం ఆలయం ప్రసిద్ధి చెందిందని.., ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామి వ్రతం ఆచరించి దర్శించుకోవడానికి వస్తుంటారని లేఖలో పేర్కొన్నారు. పథకం ద్వారా ఆలయానికి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమె మంత్రిని కోరారు.