వరద బాధితులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాజనగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా హామీ ఇచ్చారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంక గ్రామంలో ఆయన పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సాయం గురించి ఆరా తీశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున ములకల్లంక గ్రామ ప్రజలు బొబ్బొల్లంకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు బొబ్బొల్లంక, ములకల్లంక గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని వరద బాధితులకు ధైర్యం చెప్పారు. నీటమునిగిన ఇళ్లల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు.. అన్ని రకాల డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో పశువుల కోసం వెటర్నరీ క్యాంపులు ఏర్పాటు చేశామనీ.. పశువుల దాణా అందుబాటులోకి తీసుకవస్తామని హామీ ఇచ్చారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది!