కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలెవరూ తన నివాసానికి రావద్దని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఫోన్లో అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ప్రజలంతా స్వీయ రక్షణలో ఉంటేనే కరోనాను కట్టడి చేయగలమన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్థానిక పరిస్థితిని అధికారులు పర్యవేక్షించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాపారాలు కొనసాగించేందుకు చాంబర్స్ ఆఫ్ కామర్స్‌తో సంప్రదించి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ప్రతి వ్యాపారి గ్లౌజ్, మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. నిబంధనలు పాటించని దుకాణాలు సీజ్ చేయాలని సూచించారు. వలసలు వచ్చిన వారిపై నిఘా ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీలకతీతంగా ముందుకు వచ్చి కరోనాపై పోరాటం చేయటానికి సిద్ధం కావాలని ఆయా పార్టీలకు పిలుపునిచ్చారు. వైన్ షాపుల్లో.. బ్యాంకులు, మార్కెట్లో రద్దీ లేకుండా సర్కిల్స్ వేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. 104 ద్వారా గ్రామాల్లో షుగర్, బీపీ ఉన్నవారికి మందులు సరఫరా చేయాలని సూచించారు.
ఇదీ చదవండి :
రఘురామకృష్ణరాజుపై తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు