తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని విజయలక్ష్మీనగర్లో కిడ్నాప్ అయిన బాలుడు జషిత్‌ని ఇంటికి క్షేమంగా చేరేలా చూడాలని హోంమంత్రిని మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు కోరారు. దీనికి హోంమంత్రి సుచరిత సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. మరిన్ని బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. బాలుడిని అపహరించడం చాలా దురదృష్టకరమని.. జషిత్ క్షేమంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు. ఇలాంటి సంఘటనలు మున్ముందు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
దర్యాప్తు వేగవంతం...
జషిత్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి జిల్లా నలుమూలలా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాకినాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్, టౌన్ రైల్వే స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అపహరణ జరిగిన సోమవారం రాత్రి 7గంటల ప్రాంతం నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగి 2 రోజులు దాటినందున బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులతోపాటు జిల్లావ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎస్పీ నయీం అస్మీ మండపేటలోనే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.