తూర్పుగోదావరి జిల్లాలో వరి పంటను వర్షాలు వెంటాడుతున్నాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టం అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం నాటికి 243 గ్రామాల్లో 16,607 హెక్టార్లలో వరి పంటపై వర్షం ప్రభావం చూపింది. 14,416 హెక్టార్లలో నేలకొరగ్గా.. 1,931 హెక్టార్లలో ఇంకా ముంపులోనే ఉంది. 260 హెక్టార్ల పరిధిలో వరిచేలు ముంపు నుంచి బయటపడ్డాయి. శనివారం వరకూ వర్షసూచన ఉన్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత 24 గంటల్లో కాట్రేనికోన, రాజోలు, ఉప్పలగుప్తం, ఐ.పోలవరం, కాజులూరు, తాళ్లరేవు, పెదపూడి మండలాల్లో వర్షాలు ఎక్కువగా కురిశాయి. జిల్లాలోని 23 మండలాలు మినహా మిగతాచోట్ల వర్షపాతం నమోదైంది. వరిచేను మూడు, నాలుగు రోజులకు మించి ముంపులో ఉంటే పంట పాడవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఇబ్బంది లేదని, వర్షాలు కొనసాగితే మాత్రం సమస్య తప్పదని చెబుతున్నారు. 33 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లితే తప్ప పరిహారం వచ్చే అవకాశం లేదు. అకాల వర్షాలతో దెబ్బతిన్న వరిపంటపై నష్టాల గణనకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.
ఇదీ చదవండి: