తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి... జీడిపప్పు పరిశ్రమకు ఎంతో పేరుంది. ఏళ్ల తరబడి సుమారు 2 వేల మంది కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ పరిశ్రమ మూత పడింది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వ్యాపారులు జీడిపిక్కలు తీసుకొచ్చి వాటిని డ్రమ్ములో కాల్చి కమ్మటి జీడిపప్పును ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ తయారైన జీడిపప్పును జిల్లాలోని కాకినాడ, రాజమండ్రితో పాటు విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. లక్షల్లో వ్యాపారం జరుగుతుండేది. వేసవి కాలం పెళ్లిళ్ల సీజన్లో ఈ పరిశ్రమకు మరింత డిమాండ్ ఉంటుంది. ఇలాంటి సమయంలో కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ అమలు చేయటంతో పరిశ్రమలు మూతపడ్డాయి.
లాక్డౌన్ కు ముందు తయారైన జీడిపప్పును అమ్ముకునే మార్గం లేక నిల్వలు అలాగే ఉండిపోతున్నాయి. పురుగులు పట్టి, రంగు మారిపోయి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. షరతులతో కూడిన సడలింపు ఇచ్చినప్పటికీ.. ఇక్కడ పరిశ్రమలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. జీడిపప్పు తయారుచేసిన దానిని విక్రయించేందుకు సరైన రవాణా సదుపాయాలు లేవని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సుమారు 15 జీడిపప్పు పరిశ్రమలను కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ మూతపడ్డాయి. ఇప్పట్లో తాము కోలుకునేది లేదని యజమానులు అంటున్నారు. దీనిపై ఆధారపడిన మహిళలు విలవిల్లాడుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: